Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మండల పరిధిలోని సంగెం కుంట చేపల వేలం పాటను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు వెంటనే రద్దు చేయాలని గిరిజన మత్స్య సహకార పారిశ్రామిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుగులోత్ వీరు, బానోత్ హనుమాలు డిమాండ్ చేశారు. బుధవారం కారేపల్లి విలేకరుల సమావేశంలో మత్స్యసహకార సంఘం సభ్యులు బానోతు హనుమా మాట్లాడుతూ దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని సంగెం కుంట 2011 సంవత్సరం నుండి చేప పిల్లలను పెంచుకుంటూ 19 కుటుంబాలకు చెందిన గిరిజన మత్స్య సహకార సంఘం సభ్యులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని సర్వే నెం. 245లో 1.07 ఎకరాలు విస్తరించి ఉన్న సంగెం కుంట విస్తరించి ఉందని పేర్కొంటూ ఏకపక్షంగా మత్య్స సంఘం సభ్యులకు తెలియకుండా ఈనెల 20వ తేదిన వేలం పాట నిర్వహించారని తెలిపారు. దీనిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు ఆగమైపోతారని అధికారులు ఆలోచించాలని కోరారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించనున్నామన్నారు. తక్షణమే దేవదాయశాఖ నిర్వహించిన వేలం పాటను రద్దు చేసి పూర్వ స్ధితిలో సహకార సంఘంను అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఈసమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు బానోత్ బావుసింగ్, సభ్యులు భూక్యా సాములు, బానోత్ లక్ష్మన్, భూక్యా కిషన్, భూక్యా బాలాజీ, రాంబాబు, పాల్త్యీ లాలు, లావుడ్యా భద్రు తదితరులు పాల్గొన్నారు.