Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస మండల కార్యదర్శి కువ్వారపు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం తాళ్లమడ బేతుపల్లి గ్రామాల మధ్యలో రాష్ట్రీయ రహదారిపై ఉన్న నల్లవాగు కల్వర్టుపై ఏర్పడిన గుంతను పూడ్చాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నిత్యం పలు ప్రమాదాలకు దారితీస్తున్న ఈ గుంతను, వాహనచోదకులు పడుతున్న ఇబ్బందులను వ్యకాస, డీవైఎఫ్ఐ నాయకుల బృందం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిత్యం వేల సంఖ్యలో పలు రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ రాష్ట్రీయ రహదారిపై గుంత ఏర్పడి యేండ్లు గడుస్తున్నా ఆర్అండ్బీ అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. వర్షం పడిన సమయంలో గుంతలో నీరు నిలిచి ఉండడంతో వాహనచోదకులకు గుంత కనబడక ప్రమాదాలు ఎక్కువవుతున్నాయన్నారు. కల్వర్టు మూలమలుపు సమీపంలో రోడ్డు లేన్ మధ్యలో గుంత ఉండడంతో వాహనదారులు గుంతను తప్పించడానికి కూడా వీలులేకుండా ఉందన్నారు. రోజులో కనీసం ఒక్కరైన ఈ గుంత వలన ప్రమాదానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టి గుంతను పూడ్చాలని డిమాండ్ చేశారు. పరిశీలించిన వారిలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి కె.త్రిమూర్తి, నాగరాజు, రమేశ్, రామకృష్ణ ఉన్నారు.