Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే..
- ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
- వివరాలు వెల్లడించిన ఏసీపీ
నవతెలంగాణ-ఖమ్మం
ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామ శివారులో సోమవారం జరిగిన సూదిమందు హత్య నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం రూరల్ ఏసిపి బస్వారెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ చింతకాని మండలం, నామవరం గ్రామానికి చెందిన గోదా మోహన్‌రావు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చింతకాని మండలం, బొప్పారం గ్రామానికి చెందిన మృతుడు జమాల్ సాహెబ్ (48) భార్య ఇమాంబీతో మోహన్‌రావు వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన జమాల్ సాహెబ్ కొద్ది రోజుల క్రితం భార్యను మందలించాడు. అతని అడ్డు తొలగించుకోవాలని, భావించిన భార్య ఇమాంబీ ప్రియుడు మోహన్నావుతో కలిసి హత్య చేసేందుకు పథకం పన్నింది. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బండి వెంకన్నను కలిసి తన వివాహేతర సంబంధం గురించి చెప్పి చంపడానికి కావలసిన ఇంజక్షన్ తీసుకురావాలని కోరాడు. వెంకన్న రూ.ఐదు వేలు ఇస్తే ఇంజక్షన్ తెప్పిస్తానని చెప్పడంతో మోహన్‌రావు రూ.3500 ఇచ్చాడు. ఆర్ఎంపీ ఈ విషయం తన స్నేహితుడు యశ్వంత్‌కు చెప్పి అతనితో రెండు నియోవెక్ ఇంజక్షన్లు తెప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఆర్ఎంపీ వెంకన్న మరోవ్యక్తి వెంకటేష్‌తో మాట్లాడాడు. ఇమాంబీతో విషయాన్ని చెప్పి వెంకటేష్ ద్వారా ఇంజక్షన్ సాహెచ్కు వేయించాలని పంపించాడు. పథకం విఫలం కావడంతో 19వ తేదీన ఇమాంబీ తన భర్త ఆంధ్రప్రదేశ్‌లోని గండ్రాయి వెళుతున్నాడని మోహన్‌రావుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ప్లాన్ అప్లై చేసిన మోహన్‌రావు విషయాన్ని వెంకన్న, వెంకటేశ్‌లకు చెప్పాడు. వారు రెండు బైక్‌లపై వల్లభి వెళ్లి కాపు కాచారు. మృతుడు వల్లభి నుంచి బైక్‌పై గండ్రాయి వెళుతుండగా ఆర్ఎంపీ బండి వెంకన్న లిఫ్ట్ అడిగి బండి ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత వెంకన్న బండి ఆపమని చెప్పి సూది వేసి బండి దిగి వెనుక వస్తున్న వెంకటేశ్ బైక్ ఎక్కి పారిపోయాడు. మృతుుడు స్పృహతప్పి పడిపోగా స్థానికులు వల్లభి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు.
కేసు త్వరితగతిన చేధించిన రూరల్ సీఐ శ్రీనివాస్, ముదింగొండ ఎస్ఐ నాగరాజును ఏసీపీ బస్వారెడ్డి అభినందించారు. పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులను నేడు రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు.