Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ 59 ప్రకారం ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులు ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ-59 ప్రకారం ఇంటి స్థలాలు క్రమబద్దీకరణ ప్రక్రియ, సర్దుబాటు చేసిన వీఆర్ఓలకు వేతనాలు చెల్లింపు అంశాలపై జిల్లా అధికారులు, తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ-59 ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట, ఇల్లందు, లక్ష్మిదేవిపల్లి, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, పినపాక, మణుగూరు, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల నుండి మొత్తం 372 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. మండల స్థాయిలో విచారణకు టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 17 మంది జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు చెప్పారు. అర్హులకు క్రమబద్దీకరణ పట్టాలు జారీ ప్రక్రియకు రానున్న 24 వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమగ్ర నివేదికలు అందచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన నేపథ్యంలో విఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేశామని, సర్దుబాటు చేసిన విఆర్ఓలకు వేతనాలు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేతనాలు చెల్లింపులో జాప్యం చేయొద్దని, తక్షణమే బిల్లులు రూపొందించి ట్రెజరీ కార్యాలయంలో సబ్మిట్ చేయాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఆర్డిఓ స్వర్ణలత, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.