Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు ప్రభుత్వం, యాజమాన్యం పరిష్కరించకుంటే సింగరేణి సంస్థనే స్థంభింపచేద్దామని సీఐటియూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ అన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీసు ముందు మహిళలు యాజమాన్య ధోరణిని నిరసిస్తు బతుకమ్మ ఆడారు. నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కార్మికుల సమ్మెలకు సంఘీభావం తెలిపారు. అనంతరం, ప్రజా సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గత 14 రోజుల నుండి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సమ్మెచేస్తున్నారని, జీతాలు లేక పస్తులుంటు, అలమటిస్తున్న కార్మికుల కష్టాలు చూసి సింగరేణి యాజమాన్యానికి కనీస కనికరం లేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో జరుగుతున్న చర్చల్లో కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామచందర్, పి.సతీష్, ఎల్. విశ్వనాథం, శ్యామ్ కుమార్ మాట్లాడారు. సమ్మెకు సంఘీభావంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య, వీరస్యామి, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు విజయ గిరి శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా డివిజన్ నాయకులు భానో ధర్మ. తదితరులు పాల్గొన్నారు.
పర్మినెంట్ కార్మికులుసమ్మెకు రావాలి...విజయగిరి శ్రీనివాస్
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సింగరేణి పర్మినెంట్ కార్మికులు ఒకరోజు సమ్మెకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ కోరారు. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు గత 14 రోజులుగా సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న సమ్మెను గురువారం సందర్శించారు. సంఘీభావం తెలిపి మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె పరిష్కరించాలని వాళ్ళ జీతాలు వేతనాలు సౌకర్యాలు పెంచాలని, పర్మినెంట్ కార్మికులుగా వారికి అండగా నిలవాలని అవసరమైతే ఒకరోజు సమ్మెకు సింగరేణి ఉద్యోగస్తులు సిద్ధం కావాలన్నారు. సింగరేణిలో దాదాపు 25 వేల నుండి 30 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని జీతాలతో పనులు నిర్వహిస్తున్నారని, కోల్ ఇండియా వేతన ఒప్పందాలు గానీ రాష్ట్ర ప్రభుత్వ జీవోలు సింగరేణి యాజమాన్యం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేయాలని పిలుపు నిచ్చారు. జికే ఓసి, పివికే -5 లో , పీవికే-7 అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో సమ్మె కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.వీరన్న, గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు, కూరపాటి సమ్మయ్య, కర్ల వీరాస్వామి, శ్యామ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.