Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సెక్టోరల్ అధికారి ఎస్ కే సైదులు
నవ తెలంగాణ-బూర్గంపాడు
విద్యార్థులలో కనీస సామర్థ్యాల పెంపుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషిచేయాలని జిల్లా సెక్టోరల్ అధికారి ఎస్.కె సైదులు అన్నారు. మౌలిక భాష, గణిత సామర్ధ్యాల పెంపుదల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా సెక్టోరల్ అధికారి, జిల్లా ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యస్.కె. సైదులు మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థుల కోసం చేపట్టబడిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి తెలుగులో, ఆంగ్లంలో చదవడం, రాయడం గణితంలో చతుర్విధ ప్రక్రియల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. పాఠశాలలోని విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రతి ఉపాధ్యాయుడు నిబద్దతతో పనిచేయాలని ఆయన అన్నారు. రెగ్యులర్ తరగతి బోధనతో సమీకృతం చేసుకుంటూ ఈ మౌలిక భాష, గణిత సామర్ధ్యాల పెంపుదల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఆయన అన్నారు. మండలంలోని ప్రాథమిక పాఠశాల మోరంపల్లి బంజర, ప్రాథమిక పాఠశాల గౌతాపురంలను సందర్శించి అక్కడి ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థులలో తెలుగులో చదవ లేక పోవటం, గణిత చతుర్విధ ప్రక్రియలైన గుణకారం, భాగాహారం పట్ల అవగాహన లేకపోవడం అనే విషయాన్ని ఆయన గమనించారు. అదే విధంగా బూర్గంపాడు మండలంలో కేజీబీవీ పాఠశాలను కూడా సందర్శించారు. పాఠశాలలో హాజరు పట్టిక లోని విద్యార్థుల సంఖ్యకు, చైల్డ్ ఇన్ఫో లోని విద్యార్థుల సంఖ్య సరిపోయే విధంగా, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ఈ పాఠశాలకు సంబంధించి 50 మంది విద్యార్థులు చైల్డ్ ఇన్ఫోలో గ్యాప్ ఏర్పడినట్టుగా గుర్తించడం జరిగిందని దానిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని స్పెష ల్ ఆఫీసర్ కేజీబీవీకి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి పూసపాటి సాయి కృష్ణ, రాజశేఖర్ సీఆర్పీలు శ్రీనివాస్ రామకృష్ణ పాల్గొన్నారు.