Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో రహదారుల విస్తరణ పనుల పూర్తికి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 200 కి.మీ. మేర నేషనల్ హైవేల రహదారి విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో నాగపూర్ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్, ఖమ్మం నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్, సూర్యాపేట నుండి ఖమ్మం, కోదాడ నుండి ఖమ్మం, ఖమ్మం నుండి కురవి వరకు రహదారుల విస్తరణ పనులు ఉన్నట్లు వివరించారు. ఖమ్మం నుండి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ భూసేకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పనులు ప్రారంభించాలని అన్నారు. సూర్యాపేట నుండి ఖమ్మం రహదారి విస్తరణ పనులు పూర్తి చేసి త్వరలో రవాణాకు అనుమతించనున్నట్లు తెలిపారు. కోదాడ నుండి ఖమ్మం వరకు రహదారి విస్తరణ భూసేకరణ ప్రక్రియ పూర్తయి, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఖమ్మం నుండి కురవి రహదారి భూసేకరణ నోటిఫికేషన్ స్థాయిలో ఉందన్నారు. ఖమ్మం నుండి తల్లాడ రోడ్డును నాలుగు వరసల రహదారిగా విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాంతీయ అధికారి, హైదరాబాద్ కృష్ణ ప్రసాద్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, నేషనల్ హైవేస్ పీడీ దుర్గాప్రసాద్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, ఆర్ అండ్ బీ ఈఈ శ్యామ్ ప్రసాద్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.