Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం ప్రభు త్వం రెస్టారెంట్, బార్ల అభివృద్ధికి సహకరించాలని జిల్లా రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్ సభ్యులు ఆర్కె. బార్ రవికుమార్ కోరారు. గురువారం ఖమ్మంలోని ఓ రెస్టారెంట్ అండ్ బార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వానికి 42 లక్షలు చెల్లిస్తున్నామని, దీని వలన ఆర్థికంగా నస్టపోతున్నామని, దానిని దృష్టిలో ఉంచుకొని మూడు 30, 36, 42 లక్షల స్లాబ్ పద్దతిలో అవకాశం కల్పించి నష్టపోకుండా చూడాలని కోరారు. 2బి బార్ లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల పద్ధతిలో చెల్లించుటకు అవకాశాన్ని కల్పించాలని, ప్రస్తుత రెన్యువల్ విధానాన్ని ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాలకు పెంచాలని, పక్క పక్కనే ఉండుటవలన నష్ట పోతున్నామని, బార్ అండ్ వైన్స్ కు మధ్య దూరాన్ని 500మీటర్లకు పెంచాలని,ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను అసోసియేషన్ సభ్యులు కోరారు. ఖమ్మం నగరం పరిసర ప్రాంతాలలో మద్యం విక్రయానికి, సేవించడానికి అనుమతి లేనటువంటి ప్రదేశాలలో కొన్ని దాబాలు, హౌటల్ రూమ్స్, బెల్ట్ షాపులు మధ్యాన్ని విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాయని, దానివలన ప్రభుత్వానికి లక్షల రూపాయల్లో ఫీజులు చెల్లిస్తున్నా తమ రెస్టారెంట్ అండ్ బార్ల వ్యాపారం పూర్తిగా తగ్గిపోయి తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కస్టమర్లకు అనుకూలంగా సీల్డ్ లిక్కర్ సప్లై చేయుటకు 750 ఎంఎల్, 375ఎంఎల్, 180ఎంఎల్, 90ఎంఎల్ ఉండే విధంగా ఇప్పించాలని కోరారు. 2బి బార్ ఏరియాను 500నుండి 700 మీటర్లకు పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సహాకరించకపోతే మాతో పాటు 1500కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విలేఖరుల సమావేశంలో శ్రీ శ్రీ హౌటల్ రంగనాధ్, ధనలక్ష్మి బార్ నిఖిల్, కావేరి బార్ సాయి, నాయిశ్రీ బార్ నరేష్, శ్రీకళ బార్ విజయ్, కిన్నెర బార్ శ్రీను, చంద్ర బార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.