Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
- ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని..
- అర్హులైన పేదలకు 120 గజాల స్థలం కోసం డిమాండ్
- డబుల్ బెడ్రూంల ఇళ్లను పూర్తి చేసి అర్హులకు ఇవ్వాలి..
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, అర్హులైన పేదలకు 120 గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ. 5 లక్షలు తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రజా సంఘాల పోరాటవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో ఆందోళన నిర్వహించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ల సాధనకు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలనే సంఘం పిలుపు మేరకు నిరసన చేపట్టారు. అంతకుముందు స్థానిక సుందరయ్య భవన్ నుంచి గట్టయ్య సెంటర్, వైరారోడ్డు మీదుగా ర్యాలీగా కలెక్టరేట్ ధర్నా చౌక్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇండ్ల స్థలాల కోసం అనేక చోట్ల గుడిసెలు వేసుకున్న పేదలు గత కొన్ని నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్న పేదలకు పట్టాలిచ్చి ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పేదలు ధరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి అయినవి కూడా ఇప్పటికి పేదలకు కేటాయించ లేదన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తిచేసి అర్హులకు కేటాయించాలన్నారు. సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. స్థలమే లేని పేదలకు 120 గజాల స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలన్నారు.
సొంత ఇల్లు లేకపోవడం వల్ల పేదలు తాము చేసిన కష్టాన్ని అద్దెలకే చెల్లించుకోవాల్సి వస్తున్నదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తాము ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వరరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, నాయకులు మెరుగు రమణ, రమ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.