Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు.
నవతెలంగాణ-ముదిగొండ
ప్రభుత్వ భూమిని (గ్రామకంఠం) దర్జాగా కబ్జా చేసి అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి అక్రమ నిర్మాణం చేపడుతున్న వైనం మండల పరిధిలో మాదాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి మాదాపురం గ్రామానికి చెందిన గడ్డం వెంకటరమణారెడ్డి రైతు వేదిక సమీపంలో ఓ ప్రైవేట్ వ్యక్తి వద్ద 601గజాల స్థలమును కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టకుండా రైతు వేదిక్కు పోయే దారిలో ప్రభుత్వ స్థలం (గ్రామకంఠం) పది గజాల స్థలంలో మిషన్ భగీరథ పైపులైను నిర్మాణం చేశారు. ఆపైపులైను గేటువాలు మూసివేసి దానిమీద పిల్లరేసి అక్రమ ఇల్లు నిర్మాణాన్ని చేపట్టడంతో గ్రామ సర్పంచ్ ఎర్రబోలు వేణుగోపాలరెడ్డి ఫిర్యాదు మేరకు మండల పంచాయతీరాజ్ అధికారులు గతంలో అక్రమ ఇల్లు నిర్మాణాన్ని కూల్చివేశారు. కొంత కాలం ఇల్లు నిర్మాణం ఆగిపోయింది. తిరిగి మరల ఇటువల కాలం లో అదేస్థలంలో ఇల్లు నిర్మాణాన్ని సదరు వ్యక్తి చేపట్టారు. గ్రామకంఠం భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేయటం ఏమిటని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిసి కూడా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ స్థలములో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేయొద్దని గతంలో అధికారులు మందలించి నోటీస్ ఇచ్చిన సదర వ్యక్తి లెక్కచేయకుండా అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపట్టటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా.అధికారులు జోక్యం చేసుకొని సదరు వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.