Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
నిరుద్యోగ గిరిజన యువతి, యువకులకు స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందుటకు ఐటిడిఏ యువజన శిక్షణ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ అన్నారు. గురువారం స్థానిక యువజన శిక్షణా కేంద్రాన్ని పీ.ఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా అందిస్తున్న శిక్షణలను గిరిజన నిరుద్యోగ యువతి, యువకులు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కల్పించుకోవాలని తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంలో డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ గిరిజన యువతి, యువకులకు వెబ్ డెవలపర్ శిక్షణ మూడు నెలల పాటు అందించి వారికి ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పించి యూనిఫామ్ కూడా అందించడం జరుగుతుందని అన్నారు. పదవ తరగతి, ఆపైన చదివి మానివేసిన యువతి, యువకులకు రీ టెయిల్స్, ఫార్మసీ అసిస్టెంట్ 100 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వెబ్ డెవలపర్ శిక్షణ క్లాసులు సందర్శించి ఇక్కడ ఇస్తున్న కోచింగ్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకొని వారు సూచించిన విధంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన అన్నారు. అనంతరం వైటీసీలోని కంప్యూటర్ ల్యాబ్ సందర్శించి కంప్యూటర్ శిక్షణ తీసుకునే విద్యార్థిని, విద్యార్థులకు సరిపడా కంప్యూటర్లు సమకూర్చాలని జేడీఎం హరికృష్ణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో( జనరల్) ఇన్చార్జి ఆర్సిఓ (గురుకులం) డేవిడ్ రాజ్, గురుకులం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్లు మానస, రోజా, రాజేశ్వరి, స్వప్న కుమారి, వైటిసి శిక్షకులు హరిత, స్వరూప, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.