Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్ ఆశ్రమ పాఠశాల అవినీతిపై విచారణ జరిపించాలి
- అవినీతిని ప్రోత్సహిస్తున్న ఏటీడీఓపై చర్యలు తీసుకోవాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం
నవతెలంగాణ-పాల్వంచ
మెనూ పాటించని కిన్నెరసాని స్పోర్ట్స్ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం, వార్డెన్లను తక్షణమే సస్పెండ్ చేసి స్పోర్ట్స్ ఆశ్రమ పాఠశాల అవినీతిపై విచారణ జరిపించాలి. అవినీతిని ప్రోత్సహిస్తున్న ఏటీడీఓపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం అధికారులను డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ బుధవారం స్థానిక కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలపై సర్వే నిర్వహిస్తున్న క్రమంలో అనేక విషయాలు విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. హాస్టల్ వార్డెన్ మెనూ పాటించడంలేదని, స్పోర్ట్స్ విద్యార్థులకు ప్రతీ వారం మటన్ అందించాల్సి ఉండగా నెలకు ఒక్కసారి మాత్రమే పెడుతున్నారన్నారు. కానీ ప్రతీ వారం మటన్ విద్యార్థులకు అందిస్తున్నట్లు బిల్లులు పెట్టి నెలకు సుమారు రూ.30 వేలు హెచ్ఎం, వార్డెన్ మిగుల్చుకుంటు న్నారన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం వండిన భోజనం సాయంత్రం వడ్డిస్తున్నారని, మురిగిపోయిన కూరగాయలు వండుతున్నారని, మినరల్ వాటర్ ట్యాంక్ అడుగున మొత్తం దుబ్బ చేరిందని వార్డెన్, హెచ్ఎం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
సమస్యలు చెప్తే విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు వీరూ నాయక్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు బెదిరించారన్నారు.
విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులకు చెప్తుంటే స్పోర్ట్స్ విద్యార్థులను పాఠశాల గ్రౌండ్స్‌కి పిలిచి బెదిరించారని, నిజాలు చెప్తే మీకు ఆటల్లో అవకాశాలు కల్పించమని బెదిరించారని ఎస్ఎఫ్ఐ నాయకులకు విద్యార్థులు ఫోన్లు చేసి బాధను వెలిబుచ్చారన్నారు.
విచారణ జరిపించాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
పాఠశాలలో తప్పుడు బిల్లులు పెట్టి గత హెఎం, వార్డెన్ డబ్బులు కాజేసారని, దీనిలో ఏటీడీఓ పాత్ర ఉందనీపై అధికారులు తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ముగ్గరి మధ్య బ్యాంక్ లావాదేవీలపై విచారణ చేపట్టాలని, స్పోర్ట్స్ విద్యార్థులకు ఇవ్వాల్సిన నోట్ పుస్తకాలు, ఘూస్, యూనిఫారం, బ్లాంకెట్స్ పుస్తకాలు పక్కదోవ పట్టిస్తున్నారని 25 నోట్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 16 మాత్రమే ఇచ్చారన్నారు. విద్యార్థుల స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోళ్ళలో అనేక అవకతవకలు జరిగాయన్నారు.
అదే పాఠశాల వద్ద విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని గంటసేపటికి పైగా ఎస్ఎఫ్ఐ నాయకులు బైఠాయించి నిరసన తెలిపిపారు. ఏటీడీవోకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా సరైన రీతిలో స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కొత్తగూడెం టౌన్ కార్యదర్శి నాగ కృష్ణ, అధ్యక్షులు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.