Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి తానూ, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కలిసి జోడెడ్లుగా పని చేస్తామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యేతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా గత 8 ఏళ్ళుగా ప్రత్యేక రాష్ట్రంలోనే అభివృద్ధి, సంక్షేమ పధకాలు అందుతున్నాయని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు అన్ని విధాలా వివక్షకు గురైయ్యాం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్వంసం సృష్టించి రాజకీయ లబ్దిపొందేందుకు బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష సెంట్రల్ లైటింగ్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఇందుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. ఆనంతరం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసాని వెంకటేశ్వరరావును కలిసి పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, జెడ్పీటీసి వరలక్ష్మి, అశ్వారావుపేట, పేరాయిగూడెం సర్పంచ్లు రమ్య, సుమతి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు పుల్లారావు, జుజ్జూరపు వెంకన్న బాబు, నాయకులు సంపూర్ణ, మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.