Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైపులు పగిలి శిథిలావస్థలో టాయిలెట్స్
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినిలు
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ - బోనకల్
ఎంతో ఉన్నత ఆశయంతో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ రెండేళ్లుగా నిరుపయోగంగా మారింది. ఓ ప్రైవేట్ సంస్థ నిర్మించిన టాయిలెట్స్ పైపులు పగిలి దుర్వాసన వెదజల్లుతూ నిరుపయోగంగా మారింది. దీంతో విద్యార్థినిలు టాయిలెట్స్ లేక వీధులలోకే వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
2017లో ఆనాటి ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు మంచినీటి సమస్య కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తన కోటా నుంచి 3 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ మూడు లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్‌ని నిర్మించారు. 2017 నుంచి 2020 వరకు ఆ వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగపడింది. 2021 నుంచి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మోటార్ పనిచేయకపోవడంతో తొలగించారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొత్త విద్యుత్ మోటార్ ఏర్పాటు చేయవలసి ఉంది. దీంతో వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. అదేవిధంగా 2017 లోనే ఎల్అండ్ టి సంస్థ సహకారంతో టాయిలెట్స్ నిర్మాణం చేశారు. ఇందుకోసం పాఠశాలలోనే బోరు కూడా వేశారు. అయితే ఏడాది క్రితం మోటార్ చెడిపోవడంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సద్దా బాబు తన సొంత ఖర్చులతో కొత్త మోటార్‌ని తీసుకువచ్చి ఏర్పాటు చేశారు. తర్వాత కొంతకాలం నడిచింది. అయితే బోరు నుంచి టాయిలెట్స్ కొరకు ఏర్పాటు చేసిన వాటర్ సరపరా పైపులు మధ్య మధ్యలో చాలాచోట్ల పగిలిపోయాయి. దీంతో వాటర్ సరఫరా సరిగా లేకపోవడంతో టాయిలెట్స్‌ని వినియోగించడం లేదు. టాయిలెట్స్ నిరుపయోగంగా మారడంతో విద్యార్థినిలు రోడ్డుపైకి మూత్రం కోసం ప్రతిరోజు వెళ్తున్నారు. దీంతో స్థానికులు తమ ఇళ్ల వద్ద విద్యార్థినిలు మూత్రం పోయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్థానికులు ఉపాధ్యాయుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ మరో మార్గం లేక ఉపాధ్యాయులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. వాటర్ ప్లాంట్, టాయిలెట్స్ నిరుపయోగంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు ఉపాధ్యాయులు అనేకసార్లు విద్యా కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మధ్య మధ్యలో ప్రధానోపాధ్యాయుడు తన సొంత ఖర్చులతో ప్రాథమిక పనులు చేయిస్తూనే ఉన్నారు.
విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వీటి మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో మండల విద్యాశాఖకు పాఠశాలలకు మెయింటినెన్స్ కోసం ప్రభుత్వం కొంత నిధులు మంజూరు చేసేది. కానీ మన ఊరు మనబడి కార్యక్రమం ప్రవేశపెట్టి ఆ నిధులను నిలిపివేసింది. గతంలో ఆ నిధులతో ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు మరమ్మత్తు పనులు చేయించుకునేవారు కానీ నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఏమీ చేయలేని పరిస్థితికి నెట్టబడ్డారు.
మరమ్మతు పనులు చేపట్టాం: పిఆర్ ఏఈ నవీన్
మన ఊరు మన బడి కింద బోనకల్ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. మరమ్మత్తు పనులు గాను 9 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో పాఠశాలలో మరమ్మత్తు పనులు చేపట్టాం. ఈ నిధులతో టాయిలెట్స్ మరమ్మతు పనులు చేపడతాం. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ మరమ్మత్తుల కోసం ఈ నిధులు వినియోగించకూడదని తెలిపారు.