Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా సమన్వయ కమిటీ
- జిల్లా వ్యాప్తంగా 18,295 దరఖాస్తులు
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోడు సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతరులకు అటవీ హక్కు పత్రాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా మంత్రి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా, పోలీస్ కమిషనర్, ఐటిడిఎ పీవో, అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీశాఖ అధికారి, డిఆర్డీవో, డిటిడబ్ల్యుఓ సభ్యులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా సమన్వయ కమిటీని నియమించిందన్నారు. జిల్లాలో 1,57,531 ఎకరాల అటవీ ప్రాంతం (14.61 శాతం) ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఐ.టి.డి.ఏ. రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో సర్వే చేపట్టి అటవీ, రెవెన్యూ భూముల సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. జిల్లాలోని 10 మండలాల్లో 94 గ్రామ పంచాయతీలు, 132 ఆవాసాల్లో పోడు భూముల సమస్య ఉన్నట్లు తెలిపారు. పోడు భూములపై హక్కులకు జిల్లాలో 18,295 దరఖాస్తులు 42,409 ఎకరాలకు సమర్పించినట్లు వివరించారు. గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి 2005 సంవత్సరానికి ముందు నుండి పోడు భూములు సాగుచేస్తున్న గిరిజనులు, మూడు తరాలు అసగా 75 సంవత్సరాల నుండి పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనేతరులకు కేటాయిస్తామన్నారు. గ్రామస్థాయి కమిటీలో క్లెయిమ్ దారు సమక్షంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలన్నారు. ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలు, రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలని తెలిపారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం ఎప్పటి నుండి జరుగుతుందన్న వివరాలను శాస్త్రీయంగా నిర్ధారిం చేందుకు శాటిలైట్ మ్యాపుల ప్రకారం జి.పి.ఎస్. సిస్టం ద్వారా డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలన్నారు, పక్కాగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. భూమినే జీవనాధారంగా బ్రతుకుతున్న వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం కషి చేస్తున్నదని వివరించారు. గిరిజన, గిరిజనేతరులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు ఇచ్చిన తర్వాత అటవీ భూములు ఆక్రమణలు జరుగకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ 2008 నుండి 2022 కాలంలో కింద 13,276 దరఖాస్తులు స్వీకరించి, రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేతో 6143 దరఖాస్తులను ఆమోదించా మన్నారు. 17,861 ఎకరాలకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. వీరికి రైతుబంధు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ దఫాలో 18,295 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. పోడు సమస్య పరిష్కారానికి జాయింట్ సర్వే పెట్టి చర్యలు తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. అటవీ, రెవెన్యూ శాఖలు చర్చించుకుని పరిష్కరించాలని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సూచించారు. రాజకీయ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి, వైరా, పాలేరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి బోస్, డిఆర్డీవో విద్యాచందన, డిటిడబ్ల్యూఓ కృష్ణా నాయక్, తదితరులు పాల్గొన్నారు.