Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీలర్లకు భారంగా పంపిణీ
- డీలర్లను బాధ్యులను చేయవద్దు : డీలర్ల సంఘం
నవతెలంగాణ-కారేపల్లి
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణి డీలర్లకు తలమించిన భారంగా పరిణమించింది. అరకొరగా చీరలు డీలర్లకు వద్దకు రావటంతో వాటిని ఎలా పంపిణీ చేయాలంటూ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. కారేపల్లి మండలంలో 20,242 మందికి బతుకమ్మ చీరలను పంపిణి చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10,050 చీరలు మాత్రమే మండలానికి చేరాయి. వాటినే మండల అధికారులు పంపిణీ చేయాలంటూ డీలర్లకు వద్దకు చేర్చారు. సగం మందికే వచ్చి చీరలను ఎలా పంపిణి చేయాలంటూ డీలర్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ముందు వచ్చిన వారికి చీరలు పంపిణి చేయాలని మిగతావి వస్తే చేయండి లేకుంటే లేదంటూ అధికారులు తెల్పటంతో క్షేత్రస్ధాయిలో పంపిణి చేసే సమయంలో ఎలాంటి వివాదాలు అవుతాయోనని భయం డీలర్లకు పట్టుకుంది. అందుకే మండలంలో చీరల పంపిణీ జాప్యం జరుగుతుంది.
డీలర్లను బాధ్యులను చేయవద్దు : దారావత్ భద్రునాయక్, డీలర్ల సంఘం అధ్యక్షులు
ప్రభుత్వం అందరికి ఒకేసారి చీరలను అందేలా చూడాలి తప్ప సగం మందికి మాత్రమే ముందు పంపించటం వలన గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి బతుకమ్మ చీరలను మహిళలందరికి అందేలా వెంటనే సరఫరా చేయాలి.
అందరికీ చీరెలు వస్తాయి: తహసీల్ధార్ కోట రవికుమార్
ప్రస్తుతం 10,050 చీరలు వచ్చాయి. మిగితావి త్వరలో వస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికి చీరలు అందజేస్తాం. రెండు రోజుల్లో బతుకమ్మ చీరల పంపిణిని చేపట్టుతాం.