Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జ్ఞాపకార్థ కూటమి
నవతెలంగాణ- ఖమ్మంకార్పొరేషన్
నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంట పాటుపడిన వ్యక్తి పల్లా సాల్మాన్రాజ్. దివంగత సీపీఐ(ఎం) నాయకులు పల్లా జాన్రాములు సోదరుడు పల్లా ఆశీర్వాదం, మార్తమ్మ దంపతుల ఏకైక సంతానంగా జూన్ 4, 1970లో ఖమ్మంలోని మిషన్ హాస్పిటల్ ప్రాంతంలో జన్మించారు. సెప్టెంబర్ 13న పరమపదించారు. తుది శ్వాస వరకూ నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించారు. స్వశక్తిని నమ్ముకున్న సాల్మాన్రాజ్ (బజ్జిల్ అన్న) పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూనవరం మండలం మెట్టురామవరంలో 1998లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత టేకులపల్లి, ఏన్కూరు మండలాల్లోని లచ్చగూడెం, సూర్యాతండా, జన్నారం పాఠశాలల్లో పనిచేశారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై అపార విశ్వాసం ఉన్న సాల్మాన్రాజ్ గత కార్పొరేషన్ ఎన్నికల్లో తన భార్య పల్లా రోజ్లీనాను నగరంలోని 22వ డివిజన్ కార్పొరేటర్‌గా టీఆర్ఎస్ తరఫున పోటీ చేయించి విజయం సాధించడంలో కీలకభూమిక పోషించారు. తన ఏకైక కుమారుడు జాన్ అబ్రహంకు సైతం తన సిద్ధాంతాలను నూరిపోశారు. 'డబ్బు ప్రాణపదం కావచ్చు...కానీ ప్రాణాల కన్నా డబ్బు ఎక్కువ కాదు' అని తన కుటుంబ సభ్యులకు నిరంతరం చెబుతుండేవారు. నాన్న మరణం తర్వాత ఆయన మాటలన్నీ తన మదిలో కదలాడుతున్నాయని సాల్మాన్రాజ్ కుమారుడు అబ్రహం కన్నీటి పర్యంతమయ్యారు. పల్లా రోజ్లీనా 22వ డివిజన్ కార్పొరేటర్ అనేకంటే పల్లా సాల్మాన్రాజ్ భార్య కార్పొరేటర్ అనడం సముచితం అని డివిజన్ వాసులు చెబుతున్నారంటే...ఆయన ఎంతగా ఈ ప్రాంతవాసులతో మమేకం అయ్యారో అర్థం చేసుకోవచ్చు. సాల్మాన్రాజ్ జ్ఞాపకార్థ కూటమి చర్చి కాంపౌండ్‌లోని ఆయన స్వగృహంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు కుమారుడు అబ్రహం తెలిపారు.