Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్లం వేణూ.. ఇదేగా నీ చరిత్ర..!
- విలేకరుల సమావేశంలో సీపీఐ నాయకులు
నవతెలంగాణ ఖమ్మం
''సెటిల్మెంట్లు, బెదిరింపులు...బెల్లం వేణూ ఇదేగా నీ చరిత్ర... ప్రశాంత మండలంలో చిచ్చుపెడితే సహిస్తూ ప్రేక్షకపాత్ర పోషించలేం... తగు సమాధానం చెప్పక తప్పదు..'' అంటూ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహ్మద్ మౌలానా హెచ్చరించారు. శనివారం ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురంలోని జీవిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మౌలానా మాట్లాడారు. టీఆర్ఎస్ ఖమ్మంరూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, సెటిల్మెంట్లు, బెదిరించడం రాజకీయాలు కాదనే విషయం ఆయన తెలుసు కుంటే మంచిదన్నారు. అవసరాల కోసం ఎవరి పంచనో చేరి పెత్తనం చేయాలని భావిస్తే మండల ప్రజలు సహించరన్నారు. వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద గల వార్త కార్యాలయం పక్కన ''నువ్వు ఆక్రమించిన భూమి సంగతి ఏమిటి'' అని ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి ముగ్గుబొందల గుట్ట ఆక్రమణలో నీ పాత్ర ఏమిటో మండల ప్రజలకు తెలుసునన్నారు. అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ లబ్ది పొందాలని చూస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ కొంత మంది అధికారులను అడ్డం పెట్టుకుని కబ్జాకోరులను వెంటేసు కుని ముఠా నాయకునిలా వ్యవహరిస్తున్న బెల్లం వేణుకి తగు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా వ్యక్తిగతంగా నేను కానీ, నా కుటుంబం కానీ లబ్ధి పొందినట్లుగా ఉంటే ఏ విచారణకైనా సిద్ధమని, దమ్ముంటే తమ ప్రత్యర్థులు కూడా విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 193 సర్వే నెంబరులో బెల్లం వేణుకి భూమి ఎలా వచ్చిందో చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. బెల్లం వేణు చుట్టూ కబ్జాకోరులే ఉన్నారని, పోలేపల్లి సర్వే నెం.156లో ఒక ప్రభుత్వ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని కొందరు గ్రానైట్ వ్యాపారం చేసుకుంటుంటే దానికి పట్టా ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సర్వే నెం.126 లోని గురుదక్షిణ ఫౌండేషన్‌లో రెండు ఎకరాల ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు నీ అనుచరులు కాదా అందులో నీ వాటా లేదా అని ప్రశ్నించారు. చింతపల్లి గ్రామంలో కుమ్మరికుంట శిఖాన్ని ఆక్రమిస్తే ఐబి అధికారులు మీ నాయకులపై కేసు నమోదు చేసింది వాస్తవం కాదా అన్నారు. గ్రామ కంఠం భూమిని తన పేర పట్టా చేయించుకున్న ఓ ఊసరవెల్లి కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నదని, ఎవరి బతుకేంటో అందరికీ తెలుసునన్నారు. మంగళగూడెం గ్రామానికి చెందిన నున్నా నర్సయ్య తన సొంత భూమిని సాగు చేయనివ్వకుండా, విక్రయించకుండా బెల్లం వేణు పెడుతున్న ఇబ్బందులు అందరికీ తెలుసున న్నారు. కెకె రెడ్డి క్వారీ విషయంలోనూ 142 సర్వే నెంబరులో నీ అనుచరుడు సాగిస్తున్న అక్రమ వ్యవహారం నిగ్గు తెల్చాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కరకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మిడికంటి వెంకటరెడ్డి, మేళ్లచెరువు లలిత పాల్గొన్నారు.