Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసలు బంగారం ఆశ చూపి నకిలీ బిస్కెట్ను అంటగట్టిన వైనం
నవతెలంగాణ- నేలకొండపల్లి
ఎదుటివారి అత్యాశను ఆసరా చేసుకుని అసలు బంగారమని ఆశ చూపి నకిలీ బంగారంను అంటగట్టి ఊడయించిన కేటుగాళ్ల ఉదంతం ఒకటి శనివారం నేలకొండపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు స్థానిక విలేకరుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తిరుమలాపురం తండా గ్రామానికి చెందిన భూక్య వెంకన్న వద్దకు గత 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన తల్లి కొడుకులు గడిపూడి నాగలక్ష్మి, అంకమరావులు అతి తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ వచ్చారన్నారు. తమ దగ్గర రెండు లక్షల పదివేల రూపాయలు విలువగల 150 గ్రాముల బంగారు బిస్కెట్ ఉందని దాన్ని లక్ష రూపాయలకే ఇస్తామని నమ్మపలికారన్నారు. తాము అతి తక్కువ ధరకే బంగారు బిస్కెట్ను ఇవ్వడానికి కారణం తాము నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నామని తెలిపారన్నారు. అక్కడ పనిచేస్తున్న సందర్భంగా మట్టి తవ్వకాలలో తమకు బంగారు బిస్కెట్ దొరికినట్లు నమ్మించారన్నారు. అప్పటికే తిరుమలాపురం తండా పరిసర ప్రాంతాలలో కొంతమందికి బంగారు బిస్కెట్లు, వజ్రాలు దొరికినట్లు కొందరు తనకు చెప్పిన విషయాలపై నమ్మకం పెంచుకున్న సదరు బాధిత భూక్య వెంకన్న అత్యాశకు పోయినట్లు తెలిపాడు. ఎలాగైనా కూలీలకు దొరికిన బంగారు బిస్కెట్ విలువ గరిష్టంగా నాలుగు లక్షల వరకు ఉంటుందని తమకు కేవలం లక్ష రూపాయలకే ఇస్తామని చెప్పడంతో తనకు మూడు లక్షల రూపాయలకు పైగా లాభం వస్తుందని ఆశపడినట్లు తెలిపారు. దీంతో కేటుగాళ్ల మాయమాటలు నమ్మి భూక్య వెంకన్న బంగారు బిస్కెట్ కొనేందుకు సిద్ధమైనాడు. అట్టి బిస్కెట్టు నకిలీదా లేక స్వచ్ఛమైన (నిజమైన) బంగారమా తెలుసుకునేందుకు బంగారు బిస్కెట్ లోని కొంత భాగాన్ని కట్ చేసి భూక్య వెంకన్నకు ఇచ్చారు. కట్ చేసిన ముక్కను భూక్య వెంకన్న నేలకొండపల్లిలోని ఓ బంగారు దుకాణంలో పరీక్షించగా అది స్వచ్ఛమైన (నిజమైన) బంగారమని దుకాణం యజమాని తెలియజేసినట్లు చెప్పాడు. దీంతో భూక్య వెంకన్న తిరుమలాపురంలోని తన ఇంటికి వచ్చి ఇంటి వద్దనే ఉన్న తల్లి కొడుకు నాగుల్ లక్ష్మి అంకమరావులకు లక్ష రూపాయలు నగదు ఇచ్చి ఆ బంగారు బిస్కెట్ను కొనుగోలు చేశారు. బంగారు బిస్కెట్ను తల్లి కొడుకు అమ్మి వెళ్లిపోయిన కొద్ది గంటల తర్వాత భూక్య వెంకన్నకు అనుమానం వచ్చి బంగారు బిస్కెట్ను పరీక్షించగా అది నకిలీదని తేలడంతో లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నాడు. జరిగిన మోసం గ్రహించిన భూక్య వెంకన్న వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. నేలకొండపల్లి స్రవంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలి పని చేస్తుండగా మట్టిలో బంగారు బిస్కెట్ దొరికిందని మాయ చేసిన కేటుగాళ్ల మాటలకు మోసపోయిన వ్యక్తి సమాజం పట్ల అవగాహన లేని అతి సామాన్య వ్యక్తి కాకపోగా తాను పీజీ పూర్తి చేసి సమాజానికి బావి పౌరులను తీర్చిదిద్దే బిఈడి పట్టభద్రుడు కావడం విశేషం.