Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుడుపై ఫోక్సో కేసు నమోదు
- నిందితునికి వత్తసు పలికిన అధికార పార్టీ నేత
- విలేకర్లుపై దురుసు ప్రవర్తన
- బాధితురాలిని మభ్యపెట్టే ప్రయత్నం
నవతెలంగాణ-దమ్మపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అతి దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని దుర్గం గొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 13 ఏళ్ళ బాలికపై అదే పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడగా పనిచేస్తున్న పిచ్చయ్య లోబరుచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరీక్షలలో ఫెయిల్ చేయిస్తానని, మార్కులు తక్కువ వేస్తానని బాలికను బెదిరించాడు. బాలిక ఆరోగ్యం బాగోలేదని కొద్ది రోజుల కిందట తల్లి వద్దకు వెళ్ళింది. తల్లికి అనుమానం రావడంతో బాలికను నిలదీసింది. బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లి శుక్రువారం రాత్రి 10 గంటల సమయంలో దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏఎస్ఐ ప్రతాపరెడ్డి నిందితుడు పిచ్చయ్యపై ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేసు పెట్టొద్దని ఆ పాఠశాలలోని కొంతమంది ఉపాధ్యాయులు, అధికార పార్టీకి చెందిన వారు ఒత్తిడి చేయడం, మభ్య పెట్టినప్పటికీ బాలిక తల్లి ధైర్యం కూడకట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సైతం అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, కొంత మంది సిబ్బంది నిందితుడు పిచ్చయ్యకు ఒత్తాసు పలుకుతున్నారని, వారిపై సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలను ఐటీడీఏ డిడి రమాదేవి పరిశీలించారు.
ఇదిలా ఉండగా శనివారం పాత్రికేయులు పెద్దగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలకు చేరుకుని పాఠశాల హెచ్యం విజయలకిëని ఈ సంఘటనకు సంబంధించి వివరాలు అడుగుతూ ఉండగా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు విలేకరులపై దురుసుగా మాట్లాడుతూ ఇక్కడ ఇంతకు మించి సమాధానం ఏమీ రాదని, ప్రధానోపాధ్యాయురాలు కంటే ముందే సదరు నాయకుడు హుకుం జారీచేయడం కొసమెరుపు.
అనంతరం పాఠశాలను ఐటీడీఏ డిడి రమాదేవి పరిశీలించారు. ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడుపై కేసు నమోదు అయ్యిందని దర్యాప్తు జరుగుతుందని, కేసును బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పద్దం మేఘన, జిల్లా కమిటీ సభ్యులు వంశీ, మంజుల, అజిత్ మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టి ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.