Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ రవాణాలో పౌర సరఫరా శాఖ అధికారులే సూత్రధారులా ?
- నామమాత్ర చర్యలతో ఫలితాలు శూన్యం
నవతెలంగాణ-చర్ల
మండల పరిధిలోని తేగడ గ్రామపంచాయతీలో గల జీసీసీ రేషన్ షాపు నుండి శనివారం అర్ధరాత్రి అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యాన్ని స్థానికుల సహయంతో తహసీల్దార్ బి.భరణి బాబు పట్టుకున్నారు. మండల పరిధిలోని అంజనాపురం నుండి అర్ధరాత్రి వేళ దుమ్ముగూడెం మండలం బైరాగులుపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఏపి 27 టీవి 1487 నెంబర్ గల టాటా మ్యాజిక్‌లో సుమారు 15 క్వింటాల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ ఉండగా సత్యనారాయ ణపురం శివారులో స్థానికులు పట్టుకొని తహసిల్దార్‌కు సమాచారం తెలుపగా స్పందించిన తహసిల్దార్ తన సిబ్బందితో ఆ వాహనాన్ని, అక్రమ బియ్యం రవాణా చేయు వ్యాపారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో వ్యాపారి స్థానికులకు పీడీఎస్ బియ్యం వ్యాపారం ఎంతమంది చేస్తున్నారు. ఏ ఏ అధికారికి నెలసరి ముడుపులు ఎంతెంత ఇస్తుంది. ఎంతమంది ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నది, ఏ ఏ రాష్ట్రాలకు పీడీఎస్ బియ్యం తరలి వెళుతున్నది సవివరంగా వివరించారు.
అక్రమ రవాణాలో ప్రజా పంపిణీ రవాణా అధికారులే సూత్రధారులా?
పేదోడి నోటికాడ కూడును లాగుకునే ఈ అక్రమ దందాలో సివిల్ సప్లయర్స్ అధికారుల పాత్ర, సూత్రధారులు సైతం ఉన్నారని నిజాలు గుప్పమంటున్నాయి. కారణం రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న సదరు వ్యక్తి స్థానికులు పట్టుకోగానే మొట్టమొదటి ఫోన్ కాల్ పౌరసరఫరా శాఖ అధికారులకే చేయడం పలు అనుమానాలకు తెర తీస్తుంది.
నామమాత్ర చర్యలతో ఫలితాలు శూన్యం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు చేపట్టకుండా నామమాత్రంగా చర్యలు చేపట్టడం కడు శోచనీయమని పలువురు వాపోతున్నారు. శనివారం అర్ధరాత్రి దొరికిన రేషన్ బియ్యం అక్రమ రవాణా దారునిపై నామ మాత్ర చర్యలు చేపట్టి సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నారని విమర్శలు లేకపోలేదు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు : డీఎస్ఓ ఇన్చార్జి ప్రసాద్
నిరుపేదల కోసం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఎవరైనా అక్రమ రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. మా శాఖలోనే కొంతమంది అక్రమ రవాణా దారులకు కొమ్ముకాస్తున్నారని సంగతి ఈ మధ్యనే తెలిసింది. వారిపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికడతాము. .చర్ల మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రేషన్ బియ్యం అక్రమ రవాణా దారునిపై 6 ఎ కేసు నమోదు చేసి భారీగా పెనాల్టీ విధించడం జరుగుతుంది. తదుపరి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో తనపై చర్యలు చేపట్టడం సైతం జరుగుతుంది.