Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన పూల పండుగ
- నేటి నుండి దేవి శరన్నవరాత్రులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా పల్లె పట్టణం అన్న తేడా లేకుండా మహిళలు నిర్వహించుకునే బతుకమ్మ వేడుకలకు పల్లెల్లో ఉత్సవ శోభ సంతరించుకుంది. గ్రామ ప్రధాన కూడళ్ళలో గౌరమ్మలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు రహదారులకు ఇరువైపులా విద్యుత్ దీపాలంకరణ చేశారు. మొదటిరోజు ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో పూల పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు పల్లెలు సందడిగా మారనుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో మహిళలు సంబరంగా నిర్వహించుకున్నారు. నేటి నుండి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దేవి శరన్నవరాత్రులు మండలంలోని పలు దేవాలయాలతో పాటు ఆయా గ్రామాలలో మండపాలలో నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
టేకులపల్లి : మండల కేంద్రమైన టేకులపల్లిలోని కోదండరామాలయం ఆవరణలో ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఆదివారము నిర్వహించారు. బతుకమ్మ, దేవి శరన్నవరాత్రి మహౌత్సవాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తూ ఉంటారు. బతుకమ్మ చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ సందడి చేశారు. గౌరమ్మను తయారుచేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, గోలియాతండా సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్, టేకులపల్లి సీఐ అంతోటి వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.