Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపద కాలంలో ఆదుకుంటాం
- ఓఎస్డీ సాయి మనోహర్
నవతెలంగాణ-చర్ల
ఆపద కాలంలో ఉన్న ఏ ఒక్క నిరుపేదను నిర్లక్ష్యం చేయమని ఓఎస్డీ సాయి మనోహర్ అన్నారు. ఆదివారం చర్ల పోలీసులు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ బీ కంపెనీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బూరుగుపాడు గ్రామంలో భద్రాచలం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు సిబ్బందిచే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి మనోహర్, అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ హాజరయ్యారు. గత కొంతకాలంగా బూరుగుపాడు గ్రామంలోని ప్రజలు జ్వరాలు, ఇతర వ్యాధులతో బాధపడుతూ, సమీప ఆసుపత్రులకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నారని స్థానిక పోలీసులు భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ సాయి మనోహర్, ఓఎస్డీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ జీ తెలియజేశారు. స్పందించిన ఎస్పీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయమని ఆదేశించగా వారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సాయి మనోహర్, ఓఎస్డీ భద్రాచలంలోని ప్రభుత్వ వైద్యశాల అధికారులతో మాట్లాడి, బూరుగుపాడు గ్రామ ప్రజల సమస్యను వారికి తెలియజేశారు. భద్రాచలం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది సహకారంతో ఆదివారం బూరుగుపాడు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 68 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు, బ్రెడ్లు, దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓఎస్డి మాట్లాడుతూ... ఆదివాసీ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చిన వారిని ఆదుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ కో అసిస్టెంట్ కమెండెంట్ ఎం.అరుణ్ కుమార్, భద్రాచలం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డా.రాజ శేఖర్, పిల్లల వైద్యులు (పెడియాట్రిషియన్) డా.సునీల్, సాధారణ వైద్యులు (జనరల్ ఫిజిషియన్), చర్ల ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్సైలు రాజు వర్మ, వెంకటప్పయ్య, ఫార్మాషిస్టు చందు, పోలీసు శాఖ సిబ్బంది వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.