Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు అందజేయాలి
- అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి
- వ్యకాస జిల్లా కార్యదర్శి మచ్చా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పోడు భూములకు హక్కు పత్రాలు అందజేస్తామని రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారికి హక్కు పత్రాలు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ములకపాడు యలమంచిలి సీతారామయ్య భవన్లో వ్యకాస జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మచ్చా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 140 జీవో పోడు పట్టాల కోసం తీసుకువచ్చిందని, అంతకు ముందే అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కోసం దరఖాస్తులు తీసుకుని పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు కొట్టి సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ జిల్లాలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని పేదలందరికీ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇండ్లు, సాగుభూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెన్షన్లు, రేషన్ కార్డులు లేని పేదలందరికీ వెంటనే అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కారం పుల్లయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.చిరంజీవి, నిమ్మల వెంకన్న, బత్తుల వెంకటేశ్వర్లు, ముదిగొండ రాంబాబు, శెట్టి వినోద, మర్మం చంద్రయ్య, నరేష్, వెంకటరత్నం, కిరణ్, చంటి రావూజ, తదితరులు పాల్గొన్నారు.