Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది స్వయం ఉపాధి మీద ఆధారపడి పని చేస్తున్న రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరిస్తూ విడుదల చేసిన జీవో నెం.25ని గెజిట్‌గా మార్చి అమలు చేయాలని సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు, రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని మంచి కంటి భవనంలో తెలంగాణ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్, సీఐటియు) జిల్లా రెండవ మహాసభలు అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో వారు మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో, క్యాబ్, ట్రాలీ, ట్రాక్టర్, జీపు, ట్రక్కు, హార్వెస్టర్, స్కూల్ బస్సు, అంబులెన్స్, హైయిర్ బస్, డిసిఎం, మినీ డీసీఎం డ్రైవర్స్ అండ్ క్లీనర్స్, స్పేస్పార్ట్స్ యజమాన్యం, మెకానిక్స్, ఆపరేటర్స్ తదితరులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. చదువుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్‌లు, బ్యాంకుల నుండిఅప్పు తీసుకొని, వాహనాలు కొనుగోలు చేసి స్వయం ఉపాధి మీద ఆధారపడి పనిచేస్తున్నారు. ఈ రవాణా రంగ కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. ఈఎస్ఐ, పిఎఫ్, పనిగంటలు, పని భద్రత లేదు అయినా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ప్రజాసేవ చేస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఉన్న మాదిరిగా రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి, సామాజికంగా, ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ వర్కర్ల కనీస వేతనాలు సవరిస్తూ 2021 జూన్ 30న జీఓఎంఎస్ నెం.25 విడుదల చేసిందన్నారు. ఈ జీఓలో కనీస వేతనం రూ.18,019లు, హైస్కిల్డ్ వారికి రూ.39,837లుగా నిర్ణయించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిందని, జీఓ విడుదల చేసి 13 నెలలు దాటినా దానిని గెజిట్‌లో ప్రకటించకుండా యాజమాన్యాల ఒత్తిడితో కనీస వేతనాలు కార్మికులకు, ఉద్యోగులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తుమ్మ విష్ణువర్ధన్, కార్యదర్శిగా జిల్లా ఉపేందర్, కోశాధికారి డి.ఉపేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై. విక్రమ్, ఉపాధ్యక్షులుగా డి.రాందాస్, వెంకట్ మాధవరావు సహాయ కార్యదర్శిగా అమరయ్య, మహేష్, మరో 20 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.