Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం
- బతుకమ్మ పండుగకు వార్డుకు రూ.25వేలు
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ బొగ్గు గని విస్తరణలో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు మున్సిపల్ పరిధిలో ఇండ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందని, బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు గాను మున్సిపల్లోని ఒక్కో వార్డుకు రూ.25వేలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కొత్తగూడెం పురపాలక సంఘ కార్యాలయములో చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు మున్సిపల్ ఎక్స్ ఆఫీషియో మెంబర్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు హాజరయ్యారు. ఈ సమావేశము ప్రత్యేకంగా రెండు అంశాలు తీర్మానానికి పెట్టారు. కొత్తగూడెం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెం.143 లోని 15 ఎకరాలను చుంచుపల్లి మండలం వెంకటేష్ ఖని విస్తరణలో ఇండ్లు కోల్పోయిన రుద్రంపూర్‌లోని యస్ఆర్టి. క్వార్టర్స్, వనమా కాలనీ, మాయాబజార్, పాత కొత్తగూడెం నిర్వాసిత కుటుంబానికి 85 చదరపు గజాల ఇంటి స్థలం కొరకు, తెలంగాణ రాష్ట్ర పండుగ ''బతుకమ్మ పండుగ''ను పురస్కరించుకుని ఈనెల 25నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు మున్సిపాలిటీ పరిధిలోని ఘనంగా నిర్వహించుటకు, 36 వార్డులలకు ఒక్కోక్క వార్డుకు రూ.25వేలుచొప్పున, గోధుమ నాగు వద్ద బతుకమ్మ పండుగ జరుపు ప్రాంతము నందు బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయుటకు రూ.2,25,000లు, మన్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ సంబురాల ఏర్పాట్లు చేయుటకు రూ.1,00,000లను మొత్తము రూ.1,25,000లు ఖర్చు చేయుటకు కౌన్సిల్ తీర్మానం చేసి,పరిపాలనాపరమైన ఆమోదము ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ కమిషనర్ టి.నవీన్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.