Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ, పోలీస్ అధికారులు అత్యుత్సాహం ఆపాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
సీపీఐ(ఎం) అర్హులైన పోడు సాగు దారులు, గిరిజనులు పక్షాన నికరంగా పోరాటం చేసి పేద సాదాల హక్కులు కాపాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య తెలిపారు. ఇటీవల మండలంలోని రెడ్డిగూడెం, గాండ్లగూడెంలలో పోడు సాగు దారులు పై అటవీ అధికారులు దాడులను ఖండిస్తూ ఆయా పోడు ప్రాంతాలను సందర్శించి, సాగు దారులను సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పక్క సీఎం కేసీఆర్ నిరుపయోగ జీవోలతో గిరిజనులను నమ్మబలుకుతూ, మరో పక్క అటవీ అధికారులను, పోలీసులను అమాయక గిరిజనులపై ఉసి కొల్పుతున్నాడని ఎద్దేవా చేసారు. తరతరాలుగా అడవినే నమ్ముకుని, దానిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులపై అటవి అధికారుల పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు. వామపక్షాలు ఆధ్వర్యంలో గతేడాది చేపట్టిన సడక్ బంద్కు తలొగ్గిన కేసీఆర్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి బుట్టదాకలు చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. అధికారి పార్టీ ప్రజాప్రతినిధులు పెత్తనం కోసమే 140 జీఓ తెచ్చారని దుయ్యబట్టారు. గాండ్లగూడెంలో సాగు దారులకు హక్కు పత్రాలు ఉండీ, రైతు బంధు అమల్లో ఉన్నా అటవీ అధికారులు పెత్తనం చెలాయించడం క్షమించరాని నేరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె.పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ, అశ్వారావుపేట, దమ్మపేట మండల కార్యదర్శులు చిరంజీవి, మోరంపూడి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం జగన్నాధం, కలపాలభద్రంలు పాల్గొన్నారు.