Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి వార్తల్లో కెక్కిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల
- మహిళలతో ఆడిపాడిన డాక్టర్ శ్రీనివాసరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడ్డల శ్రీనివాస రావు మరోసారి వార్తల్లోకెక్కారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆయన కొత్తగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి బతుకమ్మ ఆట...పాట సందర్భంగా చిందులు వేశారు. బతుకమ్మ పాటలు కాకుండా ఇటీవల విడుదలైన డిజే టిల్లు డాన్స్ వేయడం పలు విమర్శలకు దారి తీసింది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలో ఇటీవల క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాడు. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలను ఈనెల 25వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు 10 రోజుల పాటు సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు క్యాంపు కార్యాలయంలో భారీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పెద్ద..పెద్దగా తయారుచేసిన బతుకమ్మల వద్ద పాటలు పడకుండా ఇటీవల విడుదలై యువతలో సంచలనం రేపిన డిజేటిల్లు పాటకుడాన్స్ వేస్తూ మహిళలతో చిందులు వేశారు. ఇది సామాజిక మాధ్యమాలు, వార్త ప్రసార మాధ్యమాల్లో ప్రసారమై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పలువురి విమర్శలకు దారి తీసింది. రాష్ట్ర డైరెక్టర్ ఇలా సినిమా పాటలకు చిందులు వేయడం ఏంటిందని పలువురు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవంగా చెప్పే బతుకమ్మ పండుగ రోజు సినిమా పాటలకు నృత్యాలు చేయడం సరైంది కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఏదాది ఏప్రియిల్ 5 తేదీన ఆయన సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం ఎంపీపీ చేసిన ప్రత్యంగి దేవి అమ్మవారి పూజలో ఎండు మిరపకాయలతో నిర్వహించిన ప్రత్యే హౌమం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపారు. మరోసారి బతుకమ్మ సంబరాల సందర్భంగా సినిమా పాటలకు నృత్యం చేసి డాక్టర్ గడల శ్రీనివాస్ వార్తల్లోకెక్కారు. తరచూ ఇలా వార్తల్లోకి ఎక్కడం ఆయనకు అలవాటుగా మారిందని, ఇది ప్రచారానికి ఒక తంతుగా వినియోగించుకుంటున్నారని కొంత మంది రాజకీయ ప్రముఖులు విమర్శిస్తున్నారు. కాగా కొత్తగూడెం నుండి ఆయన ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తన వంతుగా ఉనికిని చాటుకునేందుకు ఇక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో రైటర్ బస్తిలోని సింగరేణి క్వార్టర్స్‌లో సేవా కార్యక్రమాల పేరుతో ఆఫీస్‌ను ఏప్రియల్ 5న ప్రారంభించారు. కాగా తాను సొంతగా మరో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో లక్ష్మీదేవిపల్లి మండలం, శ్రీనగర్ కాలనీలో ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గృహ ప్రవేశం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. మరోసారి బతుకమ్మ పండుగ సందర్భంగా సినిమా పాటలకు నృత్యం చేసి సామాజిక మాధ్యమాలల్లో ట్రోల్ అవుతున్నారు.