Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ పూట గిరిజన కార్మికులను పస్తులుంచుతారా ?
- గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు హాస్టల్ వర్కర్ల ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం
జీతాలు ఇస్తారా...సమ్మె చేయమంటారా? అంటూ గిరిజన హాస్టల్ వర్కర్లు నినదించారు. బకాయి వేతనాలు చెల్లించాలి, అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. పండుగ పూట గిరిజన కార్మికులను పస్తులుంచుతారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన ధర్నాలో తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడారు. గిరిజన కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని విమర్శించారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటూ, కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా పస్తులుంచుతున్నారని విమర్శించారు. డైలీవేజ్ కార్మికులకు జిల్లా కలెక్టర్ సర్యులర్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ కార్మికులకు జీఓ నెం. 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ పిఎంహెచ్ హాస్టల్స్‌లో క్యాటరింగ్ పద్ధతి విరమించుకోవాలని జీఓ నెం.527ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో డీటీడీిఓల ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
బకాయి వేతనాలు చెల్లిస్తాం జేడీ హామీ : ధర్నా వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించిన జాయింట్ డైరెక్టర్ సైదులు త్వరలోనే బకాయి వేతనాలు చెల్లిస్తామని, డీటీడీఓ ద్వారా వేతనాలు చెల్లించే విధంగా వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని, ఇతర సమస్యలు కమిషనర్‌తో చర్చించి, పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ధర్నాకు మద్దతుగా మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాలడుగు సుధాకర్ మాట్లాడారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, నాయకులు జి.రాములు, పాయం ముత్తయ్య సంగ్యా నాయక్, కోటేశ్వర్, నందు, రవి, లలితమ్మ, కౌశల్య, హీరాలాల్, రాంజి, భవాత్, కృష్ణమ్మ, ఓంప్రకాష్, అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.