Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు సర్వే పట్ల సుభాష్ నగర్ కాలనీ ప్రజల ఆందోళన
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
కూలి నాలి చేసుకొని రూపాయి రూపాయి దాచుకొని సొంత ఇల్లు కట్టుకొని జీవిస్తున్న మమ్మల్ని ముంపు పేరుతో మా ఇళ్లను స్వాధీనం చేసుకుని నాసిరకంతో నిర్మించే డబల్ బెడ్ రూమ్లు ఇస్తామని సర్వే చేయటం దుర్మార్గమని భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ ప్రజలు ఉద్యమించారు. వివరాలకు వెళితే జులై నెలలో వచ్చిన వరదలతో సుభాష్ నగర్ మొత్తం జలమయమైన సంగతి తెలిసిందే. సుమారు 600 కుటుంబాలు వరదల వల్ల సర్వం కోల్పోయి నిర్వాసితులయ్యారు. ఏడేళ్లు తర్వాత భద్రాచల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితులకు 10వేల నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉన్నా ముంపు బాధితులు అందరికీ మెరక ప్రాంతంలో శాశ్వత నివాస గృహాలు కట్టిస్తామని క్యాబినెట్ లో ప్రకటించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 40 ఏళ్లుగా రూపాయి రూపాయి దాచుకొని సొంతిల్లు కట్టుకున్న ఇండ్లను వదిలి పోమనితెగేసి చెబుతున్నారు. కరకట్ట నిర్మాణానికి నిధులు కేటాయించి రెండు కిలోమీటర్ల మేర పొడవు పెంచి 10 మీటర్ల ఎత్తు పెంచితే భద్రాచలానికి ఎట్టి పరిస్థితులలో ముంపు వాటిల్లదని ఆ పని చేయాల్సిన ప్రభుత్వం ప్రజలని తరలించడానికి శ్రద్ధ చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు సీఎం దృష్టికి సమస్యను వివరంగా తీసుకువెళ్లి కరకట్టను పెంచే విషయంపై హామీ తీసుకోవాలని వారు కోరుతున్నారు. అంతేగాని సొంత ఇంటిని దూరం చేసే కుట్రలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. చావనైనా చస్తాము గాని ఎట్టి పరిస్థితుల్లో మా సొంత ఇల్లు వదులుకునే ప్రసక్తే లేదని సుభాష్ నగర్ కాలనీ ప్రజలు భీష్ముంచు కూర్చున్నారు. అందులో భాగంగా రాజకీయలతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకతాటిపై వచ్చి సోమవారం ప్రతి ఇంటిలోని చిన్న పెద్ద తేడా లేకుండా సుమారు 1000 మంది ప్రజలు పట్టణంలోని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ధర్నా చేశారు. ఆర్డీవో కార్యాలయంలోని సూపరెండెంటెండ్కి వినతి పత్రం అందించారు. అనంతరం పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాలకు ప్రదర్శనగా వెళ్లి వారి సమస్యల వినతి పత్రాలను అందించారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకొని స్థానిక శాసనసభ్యులు పొదెం వీరయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎట్టి పరిస్థితులలో కరకట్టని పొడిగించాలే తప్పా మా సొంత ఇంటి నుండి మమ్ముళ్లను దూరం చేయొద్దని వేడుకున్నారు.
అలాగే సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయానికెళ్ళి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నర్సారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులకు వినతిపత్రం ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్ల వెంకటరావు కూడా సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా తాము చేసే ఉద్యమాలకు అన్ని పార్టీలు సంఘీభావం తెలపాలని వారు కోరుతున్నారు. ఏదిఏమైనాప్పటికీ పోలవరం ముంపు సమస్య భద్రాచలంలో రగులుతుందని చెప్పాలి. ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చేఅవకాశం ఉంది.