Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
పత్తి కొనుగోళ్లు నిర్వహణ అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పత్తి కొనుగోలు ప్రక్రియపై మార్కెటింగ్, వ్యవసాయ, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, తూనికలు కొలతలు, రవాణా, సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం, ఇల్లందు (సింగరేణి మండలం), భద్రాచలం, బూర్గంపాడులలోని జిన్నింగ్ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో వరి తరువాత పెద్ద ఎత్తున పత్తి సాగు జరుగుతుందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ సంవత్సరం మన జిల్లాలో దాదాపు 160804 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని చెప్పారు. 96483 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి వస్తుందనే అంచనాతో కొనుగోలు ప్రక్రియ నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లుపై చెక్ లిస్టు జారీ చేస్తామని ఆ ప్రకారం ఏర్పాట్లు చేసి అధికారులు నివేదికలు అందచేయాలని చెప్పారు. వేయింగ్ పరికరాలను తనిఖీ చేయాలని తూనికలు కొలతల అధికారికి సూచించారు. అగ్ని ప్రమాదాలు వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు. కాటన్ సీసీఐ ఈ సంవత్సరం రూ.6380లు మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కొనుగోళ్లు ప్రక్రియలో కాలయాపన జరుగకుండా ఉండేందుకు క్రాప్ బుకింగ్ ప్రకారం రైతులకు టోకెన్లు జారీ చేయాలని, జారీ చేసిన టోకెన్లు ప్రకారం ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ అధికారి అలీం, విద్యుత్ శాఖ ఎస్ఈ. రమేష్, వ్యవసాయ అధికారి కె.అభిమన్యుడు, తూనికలు కొలతల అధికారి మనోహర్, రవాణా అధికారి వేణు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఎస్బీ సిఐ స్వామి, పత్తి కొనుగోలు అధికారి శ్రీనివాసరెడ్డి, మార్కెటింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.