Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టు నిర్మాణం పై రీసర్వే చేయాలి
- విలేకరుల సమావేశంలో మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
పోలవరంతోనే భద్రాచలంకు ముప్పు ఉందని, ఆ ప్రాజెక్టు నిర్మాణం పై రీ సర్వే చేయాలని, నిపుణులతో కమిటీ వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు కోరారు. భద్రాచలంలో సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై నిపుణులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. భద్రాచలం వద్ద కరకట్ట ఎత్తు పెంచి పొడిగించడమే ముంపునుకు సరైన పరిష్కారం అని మచ్చా అభిప్రాయపడ్డారు. భద్రాచలంలో ముంపు కాలనీ ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం గందరగోళానికి గురిచేస్తుందని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు వివరించకుండా సర్వే పేరుతో సంతకాల సేకరణ చేయటం కరెక్ట్ కాదు అన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో ముంపు కాబట్టి నిర్వాసితులకు పోలవరం ప్యాకేజీ వర్తింప చేయాలని కోరారు. ఇటీవల వరదల సందర్భంగా భద్రాచలంలో పదివేలు నష్టపరిహారం అందించిన వరద బాధితుల లిస్టు బహిర్గతం చేయాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో లిస్టు అనౌన్స్మెంట్ కాగా, భద్రాచలంలో మాత్రం ఎందుకు విడుదల చేయలేదని ఈ విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నష్ట పరిహారం అందని వాస్తవ ముంపుదారులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ముంపు ప్రాంత కాలనీ ప్రజలకు అండగా సీపీఐ(ఎం) దశల వారి ఆందోళన చేపడుతుందని తెలిపారు. ముంపు కాలనీ ప్రజల సమస్యపై రాజకీయాలకు అతీతంగా పోరాడుదామన్నారు. ఈ ప్రెస్ మీట్లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, కే.బ్రహ్మచారి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, ఎస్.గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, బి.వెంకటరెడ్డి, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, లీలావతి తదితరులు పాల్గొన్నారు.