Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2.46 లక్షలు విలువగల నగలు స్వాధీనం
- అదుపులోకి ఇరువురు
నవతెలంగాణ-అశ్వారావుపేట
పట్టణంలో ఒకే ఇంట్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస దొంగతనాలు ఘటనలో అపహరణకు గురైన బంగారు నగలను రాబట్టిన పోలీసులు ఇరువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని సబ్ జైలుకు అప్పగించారు. మంగళవారం సీఐ బి.బాలక్రిష్ణ తన కార్యాలయంలో అనుమానితులను, నగలను విలేకరులు ముందు ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఎస్.ఐ సాయి కిషోర్ రెడ్డి, సిబ్బంది కొందరితో బస్ స్టేషన్ ప్రాంతంలో ఇరువురు అనుమానితులను గుర్తించారు. వారిని విచారించి తనిఖీ చేయగా పలు నగలు లభ్యం అయినవి. ఈ క్రమంలో సాక్షులు సమక్షంలో వారి వివరాలను, వారివద్ద లభ్యం అయిన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇరువురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజిగూడెంకు చెందిన చింతలపుడి జశ్వంత్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ అశ్వారావుపేటలోని కోనేటి బజార్లో నివాసం ఉంటున్నాడు. మరొకరు గుంటూరు జిల్లా, నల్లబాడు మండలం, గుజ్జునగుళ్ళ, చంద్రమౌళి నగర్‌కు చెందిన బత్తుల వెంకట రావు. వీరు ఇరువురు ఈ ఏడాది ఆగస్టు 10 రాత్రి అశ్వారావుపేటలోని కోనేటి బజార్‌కు చెందిన గంపల ప్రకాశ్ ఇంట్లో వెండి, బంగారు నగలు అపహరించారు. సెప్టెంబర్ 11 రాత్రి అశ్వారావుపేటలోని గుర్రాల చెరువు రోడ్లో గల తిరుముల నగర్‌కు చెందిన సంకురాత్రి దుర్గా ప్రసాద్ ఇంట్లో నుండి బంగారు నగలు చోరీ చేసారు. వీరిరువురు ఏలూరు సబ్ జైల్ పరిచయస్తులు. బయటకు వచ్చాక సైతం వారి చోరీ జీవితాన్ని కొన సాగిస్తున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేటలో మకాం వేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి దగ్గర నుండి రూ.2 లక్షల 36 వేల 5 వందల విలువ గల 7 తులాలు బంగారం, రూ.10 వేలు విలువగల 20 తులాల వెండి స్వాధీనం చేసుకుని, ఈ ఇరువు రిని కోర్టుకి అప్పగించినట్లు తెలిపారు. ఎస్ఐలు అరుణ, సాయి కిషోర్ రెడ్డిలు పాల్గొన్నారు.