Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకాన్ని నీరుగార్చేందుకు యత్నాలు
- దిశా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకాభిప్రాయం
- కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష: చైర్మన్, ఎంపీ నామ
- అమృత్ పథకం నిర్వహణపై మంత్రి అజరు ఆరా
- రైల్వేపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయం
- కొండా లక్ష్మణ్‌బాపూజీకి సమావేశం నివాళి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోరాడి సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఎంపీ, కేంద్ర ప్రభుత్వ పథకముల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ నామ నాగేశ్వరరావుఆరోపించారు. కమిటీ సభ్యులు దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజాప్రతినిధులు ప్రశ్నలు సంధించారు. చైర్మన్ నామ నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని డీపీఆర్సీ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన దిశ కమిటీ సమావేశం ప్రారంభానికి ముందు కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన వివిధ పనుల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన వివరించారు. కూలీలకు సకాలంలో డబ్బులు రావట్లేదని, కొన్ని పనులకు రూ.లక్ష కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు నిధులు తగ్గించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. దీనిపై పార్లమెంట్లో ప్రస్తావిం చాల్సిందిగా ఎంపీ నామకు విజ్ఞప్తి చేశారు. దీనిపై నామ స్పందిస్తూ కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ పథకం విషయంలో పార్లమెంట్లో ఒకటి చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో అమలుతీరు మరోలా ఉందని అన్నారు. సభ్యులు కూడా దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించే స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్బీఎం) అవార్డుల్లో జిల్లాకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆరోపించారు. మరుగుదొడ్ల బిల్లులపైనా ప్రశ్నించారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న అటల్ మిషన్ ఫర్ రేజువునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (అమృత్) పథకం తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. 63 కి.మీ పనులు పూర్తికాగా ఇంకా మూడు కి.మీ పనులు పెండింగ్‌లో ఉన్నాయని కార్పొరేషన్ డీఈ రంజిత్ వివరించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు ట్యాకులు, ఐదువేల ట్యాప్‌లను కూడా కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం (ఐపీడీఎస్) అమల్లో లోపాలపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించాలని తిరుమలాయపాలెం ఎంపీపీ మంగీలాల్ కోరారు. భూగర్భజలాలు వృద్ధి చెందిన నేపథ్యంలో వాల్టా చట్టం పరిధిలోని ప్రాంతాలకూ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాల్సిందిగా సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎస్ఈ సురేందర్ సానుకూలత వ్యక్తం చేశారు.
'ఆసరా' సైట్ ఓపెన్ చేయాలి...
ఆసరా పెన్షన్ పథకం అమలుతీరుపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఆసరా కార్డుల పంపిణీ తర్వాత ఇప్పుడు విచారణ నిర్వహిస్తుండటంతో ప్రజాప్రతినిధులుగా తమపై ఒత్తిడి పెరుగుతోందని సభ్యులు నివేదించారు. కొన్నిచోట్ల 57 ఏళ్లలోపు వారికి కూడా పింఛన్లు ఇచ్చారని సమావేశం దృష్టికి తెచ్చారు. అనర్హులకు కూడా ఆసరా లభించినట్లు తెలిపారు. అర్హులున్న అనేక మందికి పింఛన్లు రాలేదని, దీని పరిష్కారం కోసం ఎంపీడీవో ఆఫీసులను సంప్రదిస్తే సైట్ ఓపెన్ కావట్లేదని చెబుతున్నారని సభ్యులు ఆరోపించారు. తక్షణం సైట్ ఓపెన్ చేయించి వితంతువులు, ఇతర పింఛన్ అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ వీపీ గౌతమ్ స్పందిస్తూ పెన్షన్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగుల పేరెంట్స్, పెన్షన్‌దారుల పేర్లపై కార్ల వంటివి ఉండటం, పెన్షన్ కటాప్ తేదీ తర్వాత చనిపోయిన లబ్ధిదారుల వివరాల వంటివి సేకరించడం కోసమేనని వివరణ ఇచ్చారు.
రైల్వేపై ప్రత్యేక సమావేశం: నామ
రైల్వే అండర్, ఓవర్‌బ్రిడ్జిలు, మూడో రైల్వే లైన్ తదితర అంశాలపై విజయవాడ నుంచి హాజరైన ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. సింగరేణి నిధులు ఇచ్చినా సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో జాప్యంపై ఎమ్మెల్యే సండ్ర ప్రశ్నించారు. సంబంధిత అధికారుల నుంచి సమగ్ర సమాచారం రాకపోవడంతో చైర్మన్ నామ జోక్యం చేసుకుని జీఎం స్థాయి అధికారులతో దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. ఇంకా పంచాయతీరాజ్, జాతీయ రహదారులు, వ్యవసాయం, భూసార ఆరోగ్యకార్డులు, ఐసీడీఎస్, నేషనల్ హెల్త్ మిషన్, ప్రధానమంత్రి ఖనిజ్ క్షోత్ర కళ్యాణ యోజన (పీఎంకేకేకేవై) తదితర స్కీంలపై సమావేశంలో చర్చించారు. 15వ ఆర్థికసంఘం నిధుల నుంచి జిల్లాకు 9 బస్తీ దవాఖానాలు మంజూరైనట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.