Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేళ్లు నాన్చి చావు కబురు చెబుతారా..?
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అజయ్ ఫైర్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కిషన్ రెడ్డి ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని కోరారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిందని, ఎన్నో ఆందోళనల తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తామని హామీ వచ్చిందని స్పష్టం చేశారు. భద్రాచలంలోని ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నారని, నవోదయ పాఠ శాలలు, మెడికల్ కళాశాలకు తదితర విషయాలలో చేసిన ప్రకటనలు, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతామని విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా ఎందుకు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తామంటూ ఎనిమిది ఏళ్ల నుండి కాల యాపన చేస్తున్నారని అన్నారు. చేతకాదని చెబితే తామే నిర్మించుకుంటామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు పై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణుల కమిటీ గతంలోనే చెప్పిందని ప్రస్తావించారు. ప్రజల్లో తిరుగుబాటు రాక ముందే బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే అందుకు కార్యాచరణ చేస్తుందన్నారు. బయ్యారం ఉక్కు నాణ్యతపై ఉమ్మడి సర్వే కు సిద్ధంగా ఉన్నామని, గతంలోనే నిష్ణాతులు సర్వే చేశారని, నాణ్యమైన ఉక్కు అక్కడ ఉందని నివేదిక ఇచ్చిందన్నారు. నివేదికను ప్రజల ముందు ఉంచాలని, లేదా పార్లమెంట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టం అని కిషన్ రెడ్డి చావు కబురు చెబుతారా? అని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి తన ప్రకటనతో తాను ఓ చేత కాని దద్దమ్మ అని నిరూపించారని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమలరాజ్, కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.