Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాధారంలో అంగన్వాడి కేంద్రం తనిఖీ
- ఉపాధి పైకం జాప్యంపై సర్పంచ్ ఫిర్యాదు
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి సమీక్షించారు. మంగళవారం కారేపల్లి మండల కేంద్రంలో అధికారులతో సమీక్ష చేశారు. ఉపాధిహామీ పధకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, మన ఊరు మన బడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మాధారం గ్రామంలో పర్యటించిన అడిషనల్ కలెక్టర్ ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో జరుగుతున్న పనులపై సర్పంచ్ అజ్మీర నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖి చేసిన అడిషనల్ కలెక్టర్ కేంద్రంలోని రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. అంగన్వాడి కేంద్రాల మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధీ హామీ పధకంలో పనులు చేసిన కూలీల పైకం చెల్లింపు జాప్యంపై సర్పంచ్ అజ్మీర నరేష్, అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆమె కూలీ పైకంపై జిల్లా అధికారులతో మాట్లాడతానని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రాజారావు, కార్యదర్శి బానోత్ నరేష్, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.