Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ డిపో బస్సులు నిల్
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు రావడానికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయానికి ఆంధ్ర రాష్ట్రం డిపో బస్సులు తప్ప తెలంగాణ డిపో బస్సులు రావడం లేదు. ఆలయానికి మధిర డిపో సుమారు 25 కిలో మీటర్ల లోపు దూరంలో ఉన్న ఒక్క బస్సు నడపటం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. ఆలయ అధికారులు ఆలయానికి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యాల గురించి పట్టించుకున్న దాఖలా లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర బస్సులే ఆలయానికి వచ్చే భక్తులకు దిక్కుగా కనపడుతుంది. ఆలయానికి గత రెండు సంవత్సరాల క్రితం బ్రహ్మౌత్సవాలలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ డిపోల నుండి బస్సులు నడపాలని భక్తులు, ప్రజలు, నాయకులు, కోరారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి రేపటి నుండి బస్సులు పంపిస్తానని మాట ఇచ్చారు తప్ప ఆ మాట నీటి మూటగానే మిగిలిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రజల వద్దకే ఆర్టీసీ అనే కార్యక్రమాలను మొక్కుబడిగా ప్రచారం కోసం నిర్వహిస్తున్నారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఆర్టీసీ నిర్వహించే కార్యక్రమాలలో మండల ప్రజలు పాల్గొని మండలంలో బస్సులు నడపవలసిన పరిస్థితిని ఆర్టీసీ అధికారులకు తెలియపరుస్తున్న తిరిగి పట్టించుకున్న దాఖలాలు శూన్యం. ప్రజల అవసరార్థం కావలసిన బస్సులు నడపని ఆర్టీసీ అధికారులు ప్రజల వద్దకే ఆర్టీసీ కార్యక్రమం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో భక్తులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆటోలు, కార్లు, ఇతర రవాణా వాహనాలను సొంతంగా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేశాన్ని వెలగక్కుతున్నారు. భ క్తులపై దీని ద్వారా అధిక భారం పడుతుందని అన్నారు. ఆలయానికి రావడానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్క బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన జమలాపురం ఆలయానికి బస్సు సౌకర్యం కావాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన దాఖలాలు లేవు. ఈనెల 26వ తేదీ నుండి స్వామివారి నవరాత్రి బ్రహ్మౌత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నా కూడా ఆలయానికి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా ఆలయానికి తెలంగాణ రాష్ట్ర డిపో బస్సులు ఏర్పాటు చేయాలని భక్తులు ప్రజలు కోరుతున్నారు.