Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు
- మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి
నవతెలంగాణ-చండ్రుగొండ
ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విజయవాడ, జగదల్పూర్, జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని వాహనాలను, సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. అలాగే పలు వాహనాలకు జరిమాన విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగే వాహనాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్, ఆర్సి బుక్ ఉండాలన్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించడం ద్వారా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులకు ఎలాంటి ఇన్సూరెన్స్ లు వర్తించవన్నారు. కొంతమంది వాహనదారులు రాష్ట్ర అనుమతులు తీసుకోకుండా రాష్ట్రం లోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు రవాణా చేసే వస్తువులకు ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించవన్నారు. ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘించి వాహనదారులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.