Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారం అడిగిన నెల రోజుల్లో అందించాలి
- త్వరలో సమాచార చట్టంపై ప్రజా చైతన్య సదస్సులు
- రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శంకర్ నాయక్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గుగులోతు శంకర్ నాయక్ అన్నారు. డీపీఆర్సీ భవనంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగిన పౌరులు, పౌర సమాచార అధికారులతో 30 కేసుల విచారణను కమిషనర్ బుధవారం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని, సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల ప్రజా సమాచార అధికారులపై ఉందని తెలిపారు. అనంతరం సమాచారహక్కు చట్టం విధులు, పరిధిపై పాత్రికేయుల సమావేశాన్ని కమిషనర్ నిర్వహించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండాలన్నారు. అధికార యంత్రాంగంలో జవాబుదారీతనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజులలో ఇవ్వాలన్నారు. అలా సకాలంలో సమాచారం ఇవ్వనందు వల్లే నేరుగా తానే ప్రజలు, ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో కమిషన్ కోర్టును ఏర్పాటు చేశానన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా కేసుల విచారణ ప్రక్రియ నిర్వహించి దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వని పక్షంలో మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని క్రమంలో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పిలేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొదటి అప్పిలేట్ అథారిటి ఉండి, పరిష్కారం చేయకపోతే సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు సంబంధించిన 30 కేసుల విచారణ నిర్వహించి దరఖాస్తు దారులకు కోరిన సమాచారం అందచేసినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు సకాలంలో అందించాలని పౌర సమాచార అధికారులను కమిషనర్ ఆదేశించారు. పౌర సమాచార అధికారులు సెక్షన్ 4(1) బి ప్రకారం 17 అంశాలతో కూడిన సమాచారం కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. సెక్షన్ 4(1) బి నిర్వహణ వల్ల కార్యాలయ విధులు నిర్వహణ, కార్యాలయ సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. సెక్షన్ 5 (1), 5 (2) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 లో పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీల పేర్లు, హెరీదా, ఫోన్ నెంబర్ల వివరాలతో అమలు బోర్డులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి పౌర సమాచార అధికారి సమాచార హక్కు చట్టం - 2005 సమాచార రిజిస్టర్ 16 కాలమ్ లు, మొదటి అప్పిలేట్ అథారిటీ 8 కాలమ్‌లతో కూడిన రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర కమిషన్ సెకండ్ అప్పిలేట్ అథారిటికి దరఖాస్తు చేస్తే, రాష్ట్ర కమిషన్ మూడు నుంచి ఆరు నెలల లోపే కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తుందని అన్నారు.
కరోనా ఉధృతి లాంటి విపత్కర పరిస్థితుల్లో టెలిఫోనిక్ హియరింగ్ చేపట్టి అనేకమంది దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించడంలో తెలంగాణ కమిషన్ సేవలు అందించిందన్నారు. జిల్లాలో 459 పై చిలుకు కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 38 వేల కేసుల్లో 30 వేల పైచిలుకు కేసులను పరిష్కరించామన్నారు. సమాచార హక్కు చట్టాలపై ప్రజలను చైతన్యవంతుల చేసేందుకు మీడియా సహకారం అందించాలని కోరారు. సమాచార హక్కుచట్టంపై ప్రజలకు చైతన్య సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎలా ఉపయోగించుకుంటున్నామో, సమాచారహక్కు చట్టాన్ని కూడా అదే తరహాలో సద్వినియోగ చేసుకోవాలన్నారు.
అంతకుముందు అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డిఓ రవీంద్రనాథ్, తహశీల్దార్లు సమాచార హక్కు చట్టం కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.