Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి ప్రకటన దురదృష్టకరం
- చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులు తీసుకురండి
- ఎంపీ నామ నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎన్నో సార్లు పార్లమెంట్లో చర్చించి కేంద్రాన్ని ఎండగట్టానని అన్నారు. 16, 17వ లోక్ సభలో బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడడమే కాకుండా స్వయంగా ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి, మాట్లాడడం జరిగిందని, లెక్కకు మించి లేఖలు కూడా రాశారని నామ స్పష్టం చేశారు. అయినా కేంద్రంలో కదలిక లేకుండా పోయిందన్నారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా తెలంగాణ పట్ల కక్షతో తీవ్ర వివక్షత చూపిస్తుందన్నారు. ఎట్టా ఎగ్గొట్టాలనే చూస్తుందే కాని ఎట్టా ఇవ్వాలనే విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. మంత్రిగా తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురావాల్సిన కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామనే ఒప్పందం ఉందని, ఇప్పుడు మాట తప్పి ఇవ్వలేమని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలా చేయడమంటే తెలంగాణపై కుట్రలో భాగమేనని నామ పేర్కొన్నారు. కాలికి వేస్తే మెడకు..మెడకు వేస్తే కాలికి వేసి తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాలని నామ సూచించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా గుజరాత్‌కు తరలించారని, ఇప్పుడు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయకుండా కుంటిసాకులు చెబుతున్నారని నామ పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలకు దిక్కులేకుండా పోతుందన్నారు. బీజేపీ కుటిల నీతికి పరాకాష్టగా మారిందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి ఆ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేసిందన్నారు. కానీ ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని మాట్లాడడం తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమేనని అన్నారు.