Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేటు వైద్యశాలలు తనిఖీ
- ఉరుకులు పరుగులు పెట్టిన ఆర్ఎంపీలు, ల్యాబ్ టెక్నీషియన్స్
- అర్హత లేని ఆర్ఎంపీ వైద్యశాలను సీజ్
నవతెలంగాణ-చర్ల
ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజా వైద్యం చేస్తున్న ఆర్ఎంపి వైద్యులపై వైద్యశాఖ అధికారులు కన్నెర్ర చేశారు. గురువారం మండల కేంద్రంలో ఉన్న పలు ఆర్ఎంపి వైద్యశాలలను డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రాజకుమార్ బృందం పర్యవేక్షించి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎటువంటి అనుమతులు లేని, అస్తవ్యస్తగా ఉన్న ఆర్ఎంపీ వైద్యశాలలను, రక్త పరీక్ష కేంద్రాలను సీజ్ చేయడంతో పాటు నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేటు వైద్యశాలలు తనిఖీ: వైద్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఆదేశాలనుసారం మండల కేంద్రంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలను తనిఖీ చేశారు. మండల కేంద్రంలో ఉన్న పలు ఆర్ఎంపి వైద్యశాలను తనిఖీ నిర్వహించిన డిఎంఅండ్హెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క ఆర్ఎంపీ వైద్యశాలలో కూడా ప్రాథమికమైనటువంటి వసతులు లేవని, ఎటువంటి అర్హత లేకుండా పసికందులకు వైద్యం నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక సాయి సంజని మందుల షాపు యజమాని ఎటువంటి అనుభవం, విద్యా అర్హత లేకుండా పిల్లల డాక్టర్ అని చెప్పుకోవడంపై డిఎం అండ్ హెచ్వో ఆగ్రహం చెంది వెంటనే అతను నిర్వహిస్తున్న రక్త పరీక్ష కేంద్రాన్ని సీజ్ చేసి వైద్యం చేస్తే ఊరుకోను, క్రిమినల్ కేసు పెడతానని గట్టిగా మందలించారు. ఆర్.ఎం.పిలు తమ తమ వైద్యశాలను మూసివేసి పరుగులు తీయడంతో పాటు తమ బోర్డులపై నీలి బరకాలను కప్పి కవర్ చేసుకున్నారు. అయినప్పటికిని డిఎంహెచ్వో తనకు ఉన్న సమాచారం మేరకు వైద్యశాలలను సీజ్ చేశారు. పరిమితికి మించి స్థాయి మరిచి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ వైద్యులపై క్రిమినల్ కేసులు సైతం పెట్టేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని ఆయన తెలిపారు.
- ఉరుకులు, పరుగులు పెట్టిన ఆర్ఎంపీలు ల్యాబ్ టెక్నీషియన్స్
డీఎంఅండ్హెచ్ఓ తనిఖీలు నిర్వహిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న కొంతమంది ఆర్ఎంపీలు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉరుకుల పరుగులు తీశారు. నిన్న మొన్నటి వరకు అధిక ఫీజులు, రక్త పరీక్షలకు అధిక రుసుము వసూలు చేసిన కొంతమంది ఆర్ఎంపీలు, ల్యాబ్ టెక్నీషియన్లు సైతం తమ తమ వైద్యశాలలను ల్యాబ్ లను మూసివేసి ముఖం చాటేశారు. మండల కేంద్రంలో ఉషారాణి, బోళ్ల వెంకటేశ్వర్లు, రంజిత్, గౌరీ శంకర్, కె. రాంబాబు, రంగా అను ఆర్ఎంపీల వైద్యశాలలను సీజ్ చేయడంతో పాటు, సాగర్ రక్త పరీక్ష కేంద్రం, సాయి సంజ్యని రక్త పరీక్ష కేంద్రాలను సీజ్ చేసినట్లు డిప్యూటీ డిఎంహెచ్వో తెలిపారు. ఎటువంటి అక్రమాలు చేయకపోతే వారు ముఖం చాటేయడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కొయ్యూరు వైద్యులు శ్రీధర్, డిప్యూటీ పారామెడికల్ అధికారి సిహెచ్ సత్యనారాయణ భద్రాచలం, చర్ల హెచ్ఇఓలు కృష్ణయ్య, వేణుగోపాల్ ఉన్నారు.