Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
- భారీ వర్షంలోనూ తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానులు
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజల మనిషి ప్రజా సేవకే అంకితమై నిబద్ధతగల ప్రజానాయకుడిగా కారం సంజీవయ్య ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పెద్దపెల్లి జిల్లా కమిటీ సభ్యులు మెదరి సారయ్య, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, సినీ రచయిత పోతిరెడ్డి నాగ కృష్ణ, సిపిఐ కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ, సీఐటీయూ నేతలు అన్నారు. సీపీఐ(ఎం) 21వ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పెద్దమ్మ గుడి దగ్గర కారం సంజీవయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర పటానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, సీఐటీయూ నేతలు, కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కారం సంజీవయ్య ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆయన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. దశాబ్దాలుగా సిఐటీయు, సీపీఎం పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని అన్నారు. ఇల్లందు మండలంలో ప్రత్యర్థి పార్టీల నుండి నిర్బంధాలు, దాడులు, బెదిరింపులు లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడి సిపిఎం, సిపిఐ కార్యకర్తలకు అభిమానులకు అండగా నిలిచారని అన్నారు. కార్యకర్తల కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు సమస్య-పరిష్కారం అయ్యేంతవరకు అక్కడే ఉండేవారని అన్నారు. కార్మిక కర్షక ఐక్యతకు బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసారన్నారు. ఆయన పట్టణ మండల కమిటీ లో సభ్యుడిగా ఉండి పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల తయారీకి ఎనలేని కృషి చేసిన మహనీయులు అని అన్నారు. ఆయన బాటలో ఎంతోమంది ప్రయాణించి ప్రస్తుతం జిల్లా నేతలుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారని అన్నారు. అనంతరం సీఐటియు రాష్ట్ర నాయకులు కూకట్ల శంకర్, బ్రాంచి కార్యదర్శి ఎండి అబ్బాస్, సీపీఎం నేతలు దేవులపల్లి యాకయ్య, అబ్ధుల్ నబి, సీపీఐ నేత ఉడుత ఐలయ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తోడేటి నాగేశ్వరరావు, సింగరేణి అధికారి బంగారు సారంగపాణి, కాంగ్రెస్ నేత వెంకట నారాయణ, గుగ్గిళ్ళ యాదగిరి, ప్రసంగించారు. సుల్తానా అధ్యక్షతన జరిగిన ఈ సభలో తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, వాసం రాము అబ్బాస్ జైబున్నిసా, లక్ష్మీ సర్వాన్, లక్క రాజేశ్వరరావు పాల్గొన్నారు.