Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వైద్యులు రోగులకు మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, వారివద్ద డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో గురువారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు కేంద్రంలో వివిధ విభాగాల వైద్యులు చేపట్టిన ఆపరేషన్లు, ఓపి, పరీక్షల నిర్వహణపై సమీక్ష చేశారు. వసతులు, సౌకర్యాల పరంగా రోగులకు సేవలందించాలని అన్నారు. వైద్యులు, రోగులతో సేవాదక్పథంతో మెలగాలన్నారు. బయోమెట్రిక్ ద్వారానే హాజరు ఇవ్వాలని, వేతనం బయోమెట్రిక్ ఆధారంగానే చెల్లిస్తారన్నారు. టి-హబ్, క్యాథ్ ల్యాబ్, అన్ని విభాగాల్లో ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలు అభివద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. నైట్ డ్యూటీ వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలన్నారు. పిల్లల ప్రత్యేక వైద్యులు నైట్ డ్యూటీలో ఉండాలని, రాత్రి సమయాల్లోనూ ప్రసవాలు చేయాలి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, వారివద్ద డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. భోజన పథకంపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసు నమోదు చేయాలని ఆయన తెలిపారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రసూతి, న్యూరో, ఇఎన్ టి విభాగాల్లో కావాల్సిన వాటికి ఇండెంట్ సమర్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ప్రయివేటు కంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువగా అందించేలా చూడాలన్నారు. కార్డియాక్, ఆర్థో సేవలను మెరుగుపర్చాలన్నారు. అన్ని విభాగాలు మెరుగైన సేవలు అందించి, ఎక్కువ రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. బి.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా.బి.మాలతి, గైనిక్ హెడ్ డా.కృప ఉషశ్రీ, ఆర్ఎంఓ డా. శ్రీనివాస్, వివిధ విభాగాల బాధ్యులు, సీనియర్ రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.