Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 2న పునఃప్రారంభం
- గ్రంధాలయాన్ని ఆదరించండి : అధ్యక్షులు మురళీధర్ బూతడా
నవతెలంగాణ-ఇల్లందు
భారత స్వాతంత్రోద్యమ కాలంలో దేశ స్వాతంత్రం కోసం నాటి ఉద్యమ కారులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. నాడు అవలంబించిన పద్ధతుల్లో ఊరురా గ్రంథాలయాలు ఏర్పాటు కూడా ఒక ఉద్యమం సాగింది. బొగ్గుట (ఇల్లందు)లో కూడా నాటి స్వాతంత్రోద్యమ కారులు 1939లో ఆమ్ బజార్లో శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. జాతీయోద్యమ నాయకులు సైతం గ్రంథాలయాన్ని సందర్శించి రిజిస్టర్లో సంతకాలు చేసేవారు. నాటి దినపత్రికలు, వార, పక్ష పత్రికలు, గ్రంథాలు, ఎంతో విలువైన సాహిత్యం అందుబాటులో ఉండేది. జాతీయోద్యమంలో నేతలు ఇచ్చే సందేశాలు వేలాది మంది యువకులు, విద్యావంతులు పత్రికల ద్వారా తెలుసుకొని స్థానికంగా ఉద్యమాలు చేసేవారు. నాటి నుండి 1981 వ సంవత్సరం వరకు శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం నిరాటంకంగా కొనసాగింది. తదనంతరం నిర్వహణ లోపాలు దీనికితోడు గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో మూతపడింది. 1996లో కొందరు ఒక అకతాయి కుర్రోళ్ళు లోనికి ప్రవేశించి విలువైన గ్రంథాలను దొంగలించారు.
పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఎంతో చరిత్ర గల గ్రంథాలయం శిథిలావస్థకు చేరి నేటి యువతకు ఉపయోగంలో లేకుండా పోవడం పట్ల విద్యావంతులు, మేధావులు బాధాకరంగా భావించారు. పూర్వ వైభవం తేవడం కోసం డాక్టర్ సుధాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం వ్యాపారస్తులు అంతా సమావేశమై దుర్గా లాల్ గుప్తా నేతృత్వంలో సురేష్ లాహౌటి, డాక్టర్ టి.సుధాకర్ కలిసి 2001లో గ్రంథాలయ అభివృద్ధి పరిచారు. అనంతరం 2004లో గ్రంథాలయం వాడుకలోకి వచ్చింది. రెండవ దశలో 2012లో పూర్తి స్థాయి అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. గ్రంథాలయం అధ్యక్షులుగా మురళీధర్ బూతడా, ప్రధాన కార్యదర్శిగా జుగల్ కిషోర్ ఖండేల్వాల్, కోశాధికారిగా కొప్పురావూరు భాస్కరరావు, గౌరవ సలహాదారులుగా చంద్ర చంద్రశేఖర్, గౌరిశెట్టి పురుషోత్తం, డాక్టర్ టి.సుధాకర్, అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయానికి మరింత అధునాతన పద్ధతులలో అభివృద్ధి చేశారు.
గ్రంధాలయాన్ని ఆదరించండి : కమిటీ అధ్యక్షులు మురళీధర్ బూతడా
శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తకగ్రంథాలయానికి పూర్వవైభవం తెచ్చామని యువకులు, విద్యార్థులు, విద్యావంతులు ,మేధావులు ఆదరించాలని కమిటీ అధ్యక్షులు మురళీధర్ బూతడా, ప్రధాన కార్యదర్శిగా జుగల్ కిషోర్ ఖండేల్వాల్, కోశాధికారిగా కొప్పురావూరు భాస్కరరావు, గౌరవ సలహాదారులుగా చంద్ర చంద్రశేఖర్, గౌరిశెట్టి పురుషోత్తం, డాక్టర్ టి.సుధాకర్‌లు కోరారు. నూతన గ్రంథాలయ భవన సముదాయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్టోబర్ 2న ఎమ్మెల్యే హరిప్రియ ఇతర ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ప్రారంభించనున్నామని తెలిపారు.