Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 చోరీ కేసుల్లో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
- విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని కొంతమంది వ్యక్తులు ముస్తఫానగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లుగా అందిన సమాచారంతో ఖమ్మం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిందితులు సూర్యాపేట జిల్లా కాగిత రామచంద్రపురం గ్రామానికి చెందిన నూకమళ్ళ నాగేంద్రబాబు, పప్పుల రాజ్ కుమార్ అలియాస్ పండు, అదే గ్రామానికి చెందిన స్నేహితులు బాదే నాగేంద్రబాబు, మండల అశోక్, బాణాల ముత్యాలు, చింతమల్ల వెంకన్న, కులకులపల్లి మహేశ్‌తో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన తెలగమల్ల వెంకటేశ్వర్లు అలియాస్ రవిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేర ప్రవృత్తిని ఎంచుకొని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దొంగతనం చేసిన బంగారాన్ని కొన్న ఖమ్మం గాంధీచౌక్‌కు చెందిన జ్ఞానేశ్వరి బంగారం దుకాణం, ఖమ్మంకు చెందిన ఎలబోయిన కృష్ణ కూడా నిందితుడని తెలిపారు. నిందితులు ఖమ్మం నగరంలో 27, సూర్యాపేట జిల్లాలో 01 మొత్తం 28 ఇళ్ళలో బంగారం, వెండి ఆభరణాలు ఇతర వస్తువులు దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. దొంగలించిన డబ్బుతో నిందితులు నూకమళ్ళ నాగేంద్రబాబు, పప్పుల రాజ్ కుమార్ అలియాస్ పండు అనే వ్యక్తులు గోవా, విశాఖపట్నం ప్రాంతాలలో తిరుగుతూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. నిందితుడు నూకమళ్ళ నాగేంద్రబాబు వృత్తిరీత్యా డ్రైవర్. ఖమ్మంలో ఒ ప్రముఖ వైద్యుడు వద్ద గత కొంతకాలం పనిచేస్తూ..తన సమీప బందువు అయిన పప్పుల రాజ్‌కుమార్ అలియాస్ పండుతో కలసి ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం వుంటున్నారు. ఇటీవల డాక్టర్ వద్ద డ్రైవర్ ఉద్యోగం వదిలేసి బయట యాక్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన ఏడుగురుతో కలసి అప్పుడప్పుడు తన నివాసంలో మద్యం సేవించడం..జల్సా అవసరాల కోసం నేర ప్రవృత్తి ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత రెండేళ్ళలో ఖమ్మం వన్ టౌన్ 15, ఖమ్మం ఖానాపురం హావేలి 10, ఖమ్మం టూ టౌన్ 2, సూర్యపేట జిల్లా అనంతగిరి పోలీసు స్టేషన్ పరిధిలో 1 మొత్తం 28 ఇళ్ళలో చోరీ చేశారని తెలిపారు. దోచుకున్న చోరీసొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని తెలిపారు.
స్వాధీనం చేసుకున్న చోరీసొత్తు
నిందితుల నుంచి 638 గ్రాముల బంగారు నగలు, 2 కేజీల వెండి, 10 ఎల్.ఇ.డి. టివీలు, 03 గ్యాస్ సిలెండర్లు, బంగారు, వెండి విలువ సుమారు రూ 40 లక్షల వరకు ఉంటుందన్నారు. నగరంలోని సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో భద్రతను పెంచామని, ఆ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఖమ్మంలో ఇటీవల జరిగిన దేవాలయంలోని చోరీ కేసులో నిందితులను గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా రూరల్ సిఐపై విచారణ కొనసాగుతుందని, విచారణ పూర్తయిన తర్వాత దానిపై వివరాలు వెల్లడిస్తామన్నారు. సూది మందు హత్య కేసులో విచారణ జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుపుతామన్నారు. నిందితులను పట్టుకొని, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న సిసిఎస్ ఏసిపి టి.రవి, నగర ఏసిపి ఆంజనేయులు, సిసిఎస్ సిఐలు ఎన్. మల్లయ్య స్వామి, పినవీన్, వన్ టౌన్ సిఐ చిట్టిబాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.