Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షపు వరద నీరంతా రోడ్డు పైనే
నవతెలంగాణ-వైరా
నూతన మునిసిపాలిటీ రూపురేఖలు మార్చాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అధిక భాగం సిసి రోడ్లకు ఖర్చు చేశారు. వైరా మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కోటిన్నర ఖర్చు చేసి డ్రైన్లు నిర్మించారు. మధిర రోడ్డులో కూడా మరో 50 లక్షలు వెచ్చించి కొంత మేర రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించారు. ఆధునిక పద్దతిలో డ్రెయిన్లు నిర్మించాల్సిన కాంట్రాక్టర్ హైదరాబాద్లో ఉండి నిర్మాణ దక్షతలేని వారితో పనిచేయించటం వలన, ఎన్నో నిర్మాణ లోపాలు బయట పడినవి. ప్రస్తుతం నిర్మించిన డ్రైన్లలోకి రోడ్లపై ప్రవహించే వరద నీరు రావటానికి వీలు లేకుండా నిర్మించారు. అందువలన వర్షం వస్తే రోడ్ల పైనే ప్రవహిస్తుంది. కొత్తగా నిర్మించిన డ్రైనేజీలలోకి ఇళ్లలో వాడుకున్న నీరు మాత్రమే వస్తుంది. డ్రైనేజీ నిర్మాణంపై పురప్రముఖులు ఎంత మంది అభ్యంతరాలు చెప్పినా, పిర్యాదులు చేసినా కాంట్రాక్టర్ గుమస్తాలు లెక్కచేయక పోవటం, అధికారులు, పురపాలక పాలక వర్గం దృష్టికి తీసుకెళితే కాంట్రాక్టర్ ఎవర్నీ లెక్క చేయటం లేదని చెప్పటం వింత గొలిపే విషయం. మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది డ్రైనేజీ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు వెల్లువెత్తినా లెక్క ఉండదు. మునిసిపల్ పాలక వర్గ, అధికారుల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పట్టణ వాసులకు కొత్త కష్టాలు తెస్తున్నవి. మధిర రోడ్డులో ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల ( బాలికలు) ఆవరణలో నీరు కొత్తగా నిర్మించిన డ్రైనేజీ ద్వారా బయటకు పంపేందుకు నిర్మించగా డ్రైనేజీ లోకి రాని పరిస్థితి. డ్రైనేజీలు నిర్మించక ముందే బాగుందని అంటున్నారు. మునిసిపల్ అధికారులు కళ్ళు తెరిచి వర్షపు నీరు కొత్తగా నిర్మించిన డ్రైనేజీల ద్వారా పట్టణం బయటకు పంపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.