Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు, ఏరియర్స్ చెల్లించడంలో ఖమ్మం నగర పాలక సంస్థ జాప్యం చేయడం సరికాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్ధన్, ఐఎఫ్టీయు మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.రామయ్య, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ కేవి కార్మిక సంఘం ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శి బుర్రి వినరు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అతిపెద్ద పండుగ దసరాకి మున్సిపల్ కార్మిక కుటుంబాలు పస్తులు ఉంచకుండా పండుగ లోపే జీతాలు చెల్లించాలని, అలాగే కొంతమంది కార్మికులకు రావాల్సిన పెండింగ్ జీతాలతో పాటు నగర పాలక సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ పెండింగ్ ఏరియర్స్ కూడా దసరా లోపే చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంవత్సరానికి రెండు సార్లు ఆరోగ్య రక్షణ పరికరాలు అందించడంలేదని విమర్శించారు. గత రెండేళ్ల క్రితం ఒక్కసారి మొక్కుబడిగా ఒక్కసారి కార్మికులకు బట్టలు, సబ్బులు, నూనేలు, చెప్పులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. కార్మికులకు ప్రభుత్వం సంబంధిత వస్తువులు ఇవ్వమన్నా నగర పాలక సంస్థ ఎందుకీవ్వడం లేదని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు రావాల్సిన పరికరాలు పెండింగ్ ఏరియర్స్ జీతాలు చెల్లించకుంటే ఆందోళన చేపడతామని, మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐఎఫ్టీయు కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.రాందాస్, సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జినక శ్రీను, నాయకులు దొడ్డా నర్సింహరావు, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షేక్ హుస్సేన్,కె.మహేష్, టిఆర్ఎస్ కేవి ఖమ్మం మున్సిపల్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గణేష్.జ్యోతి, ఉపాధ్యక్షులు దాసరి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.