Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలువు దోపిడీ చేస్తున్న ల్యాబ్‌లు
- కమీషన్ మత్తులో ఆర్ఎంపీలు
నవతెలంగాణ-చర్ల
ఎటువంటి అర్హతలు, అనుమతులు లేకుండా రక్త పరీక్షా కేంద్రాల నిర్వహిస్తూ ఏజెన్సీ వాసులను కొంతమంది రక్త పరీక్షా కేంద్రాల నిర్వహకులు పరేషాన్ చేస్తున్నారని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. సంపాదనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని కొంతమంది ఆర్ఎంపీలు, రక్త పరీక్ష కేంద్రాల నిర్వహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. సాధారణంగా సీబీపీ పరీక్ష చేస్తే రూ.200, డెంగ్యూ పరీక్ష చేస్తే రూ. 600, టైఫాయిడ్ రూ.200, మలేరియా రూ.200, సిఆర్పి రూ.300, ఈఎస్ఆర్ రూ.150, ఎల్ఎఫ్టీ రూ.600, పాఎఫ్టి రూ.600, కొలెస్ట్రాల్ పరీక్షకు రూ.650, చాతి ఎక్స్‌రే రూ.250, ఈసీజీకి రూ.200 చొప్పున ప్రముఖ వైద్యశాలలో పరీక్షలకు రుసుము తీసుకుంటూ ఉండగా చర్ల మండల కేంద్రంలో ఉన్న రక్త పరీక్షా కేంద్రాలలో మాత్రం ఆయా రేట్లు అన్నీ కూడా సగానికి సగం ఎక్కువగా ఉండడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలు, నిరక్షరాస్యులకు రక్త పరీక్షల రేట్లు మూడు రెట్లు నుండి నాలుగు రెట్ల వరకు ఎక్కువ చేసి డిమాండ్‌గా వసూలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. రోగం వచ్చి నానా అవస్థలు గురవుతూ ఉంటే మునిగే నక్క పై తాటిపండు పడ్డ చందంగా రక్త పరీక్ష కేంద్రాల నిర్వహణ ఉందని గిరిజనులు వాపోతున్నారు. ఈ రక్త పరీక్ష కేంద్రాల వలన పరేషాన్ అంతా ఇంతా కాదని పలువురు లబోదిబోమంటున్నారు
నిలువు దోపిడీ చేస్తున్న ల్యాబ్‌లు : దొరికినంత దోచుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో రక్త పరీక్షా కేంద్రాల నిర్వహకులు నిరుపేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని వాదనలు లేకపోలేదు. జబ్బు ఒకటైతే నిర్ధారణ పరీక్షలు మరో విధంగా చేసి నిరుపేదల నుండి వేల రూపాయలు జలగలు పిండినట్టు పిండేస్తున్నారనే విమర్శలు కోకోలలు. 100 రూపాయల తగ్గిన నిర్ధారణ పరీక్షల కాగితాలు ఇచ్చేది లేదంటూ గంటల తరబడి రక్త పరీక్షా కేంద్రాల వద్ద ఉంచుకొని పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాతే పరీక్షా ఫలితాలు ఇచ్చారంటూ నిరుపేదలు లబో, దిబో మన్న తరుణాలు లేకపోలేదు.
కమీషన్ల మత్తులో ఆర్ఎంపీలు : కమీషన్ల కక్కుర్తితో ఉన్న రోగం, లేని రోగం నిరుపేదలకు బూచి చూయించి పెద్ద మొత్తంలో రక్త పరీక్షలు, ఎడా, పెడా మందులు రాస్తూ 100తో పోయేదాన్ని వెయ్యి రూపాయలు చేసి ఇష్టానికి డబ్బులాగుతున్నారని నిరుపేదలు మండిపడుతున్నారు. జ్వరమని వెళ్తే చాలు కేవలం కమిషన్ల కోసమే డెంగ్యూ టెస్ట్, ఆ టెస్టు, ఈ టెస్ట్ అని రోగిని మానసిక ఒత్తిడికి తీసుకువచ్చి పరిమితికి మించిన వైద్యం చేస్తూ ప్రజల పాలితల్లా ఆర్ఎంపీలు తయారవుతున్నారని ఘాటు విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ జరాలను సైతం భూతద్దంలో చూపించి వేల రూపాయల బిల్లును ఎడాపెడా లాగుతున్నారని కొంతమంది వైద్య విశ్లేషకులు వివరిస్తున్నారు.
ఆర్ఎంపీలు, రక్త పరీక్ష కేంద్రాలపై చర్యలు చేపట్టాలి : సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
కారం నరేష్
నిరుపేదలను నిలువునా ఉంచుకున్న ఆర్ఎంపీలను రక్త పరీక్ష కేంద్రాల నిర్వహకులపై వైద్యశాఖ అధికారులు తగు కఠిన చర్యలు చేపట్టాలి. లేకపోతే ఆర్ఎంపీల విచ్చలవిడితనం రోజు రోజుకి పెట్రేగి పోతుంది. చర్ల మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను నిర్మించి వైద్యులను సిబ్బందిని వెంటనే నియమించి ప్రజా వైద్యాన్ని కాపాడాలి. ప్రజా వైద్యం కాపాడడంలో ప్రజా ప్రతినిధులు అధికార, ప్రతిపక్ష నాయకులు సైతం చొరవ చూపాలి. ప్రభుత్వ వైద్యశాల మండల కేంద్రంలో లేకపోవడంతో కొయ్యూరు వెళ్లి వైద్యం చేపించుకోలేక నిరుపేదలు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ప్రజా వైద్యాన్ని మెరుగుపరచాలి.
వైద్య వ్యవస్థను గాడిలో పెడతాం : డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజకుమార్
ఏజెన్సీలో అస్తవ్యస్తంగా ఉన్న వైద్య వ్యవస్థను గాడిలో పెడతాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం అన్ని సౌకర్యాలు, అర్హతలు ఉన్న ఆర్ఎంపీలు మాత్రమే వైద్యం చేసేటట్లు చర్యలు చేపడతాం. వైద్య శాఖ నామ్స్ ప్రకారం అన్ని వసతులు ఉన్న వారికే రక్త పరీక్షా కేంద్రాల అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. వసతులు లేని వారిపై తగిన చర్యలు చేపడతాం.