Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న వ్యవసాయ కార్మిక పోరాటాలకు, భూ సంబంధిత సమస్యల పోరాటాలకు ఖమ్మం నగరం వేదికగానుందని, దీనికి ప్రారంభ సూచికగా డిసెంబర్ 5న జరుగుతున్న భారీ బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చి జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. స్థానిక త్రీ టౌన్ ప్రాంతంలోని గాంధీ చౌక్ సెంటర్ నుండి కిరాణా హమాలి, సిటీ హమాలీ, రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ సంఘీ భావంగా ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు యూనియన్ల అధ్యక్షులు శ్రీశైలం, కోడి వెంకన్న, వెంకన్నల అధ్యక్షతన జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ నేడు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే అందుకోసం మోడీ బిజెపి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. మూడు నల్ల చట్టాలు ముందుకు తెచ్చి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి వెనక్కి తగ్గాల్సి వచ్చింది అన్నారు. అయినా సరే వ్యవసాయ రంగానికి భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం, కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పి కొట్టడం ఐక్య పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం వ్యవసాయ కార్మికులు, రైతాంగం, కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాలకు వేదికగా డిసెంబర్ 5, 6, 7 తేదీలలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక మూడవ రాష్ట్ర మహాసభలు నిలవనున్నాయన్నారు. 5న ఖమ్మం నగరంలో లక్ష మందితో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభలలో కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, అనేకమంది జాతీయ రాష్ట్ర నాయకత్వం హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర రావు, జిల్లా అధ్యక్షులు టీ.విష్ణు, టియుడిఎఫ్ జిల్లా కన్వీనర్ ఎర్ర శ్రీనివాసరావు, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి తుషాకుల లింగయ్య, సిఐటియు జిల్లా నాయకులు భూక్య శ్రీనివాసరావు, బండారు యాకయ్య, పాశం సత్యనారాయణ, హమాలి సంఘాల నాయకులు మట్టిపల్లి వెంకన్న, సుంకేసుల వెంకటేశ్వర్లు, వల్ల రాజు, సాయిలు, వెంకట్ నారాయణ, తులసి రామ్, మరియు మేస్త్రి లు, తదితరులు పాల్గొన్నారు.