Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్తులు
నవతెలంగాణ - బోనకల్
రైల్వే అధికారుల వైఖరికి నిరసనగా మండల పరిధిలోని గోవిందాపురం(ఏ) గ్రామస్తులు శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కి తీవ్ర నిరసన తెలిపారు. కానీ ఎటువంటి హామీ పొందకుండానే నిరసనను విరమించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బోనకల్లు రైల్వే స్టేషన్, మోటమర్రి రైల్వే స్టేషన్లకు మధ్య గోవిందాపురం ఏ గ్రామం ఉంది. గోవిందాపురం ఏ గ్రామం మధ్యలో రైల్వే గేటు ఉంది. ఈ రైల్వే గేటు గ్రామాన్ని రెండు భాగాలుగా చీల్చింది. దీంతో గ్రామస్తులు అటు నుంచి ఇటు రావాలన్న ఇటు నుంచి అటువైపు వెళ్ళాలన్నా రైల్వే గేటు వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోటమర్రి రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోనే జగ్గయ్యపేట వరకు రైల్వే లైన్ వేశారు. ఈ రైల్వే లైన్ గోవిందాపురం ఏ గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ సిగల్ వ్యవస్థ వలన గోవిందాపురం ఏ రైల్వే గేటును గంటల తరబడి తీయకుండా ఉంచుతున్నారు. ఈ గేటు వలన గ్రామస్తులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాలలో రైళ్లు వచ్చే సమయంలో గేటు వద్ద పశువులు, మేకలు, గొర్రెల లాంటివి ఆ శబ్దానికి అదురుకొని పారిపోతూ రైలు కింద పడి మృత్యువాత పడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దీంతో గ్రామస్తులు గేటు వద్ద అండర్ రైల్వే బ్రిడ్జి నిర్మించాలని అనేక ఏళ్లుగా రైల్వే అధికారులను కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం రైల్వే గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ నిధులు మంజూరు చేసింది. కానీ సదరు కాంట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో నిర్మాణ పనులు ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి. ఏడాది నుంచి పనులు ప్రారంభం కావడం లేదు. దీంతో గ్రామస్తులు అనేకసార్లు అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని రైల్వే అధికారులను కోరుకుంటూ వస్తున్నారు. అయినా వారి నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో మరో మార్గం లేక గ్రామస్తులు రైల్వే గేటు సమీపంలో గల వాటర్ ట్యాంక్ ఎక్కి రైల్వే అధికారుల వైఖరికి నిరసన పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. స్థానికులు పోలీస్, తాసిల్దార్ కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొంతమంది వాటర్ ట్యాంక్ ఎక్కడ మరికొందరు ట్యాంక్ వద్దకు పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన కొంతమంది దూకేందుకు ప్రయత్నించగా కింద ఉన్న గ్రామస్తులు చాలా సేపు కిందకు దూక వద్దని వారించారు. గంటపాటు వాటర్ ట్యాంకుపై ఉన్నవారు ఏం చర్యకు దిగుతారోనని ట్యాంక్ కింద ఉన్న గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులపై పోరాటం చేద్దామని ఎటువంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, మరికొందరు గ్రామ పెద్దలు వారిని చాలాసేపు వారించారు. దీంతో వాటర్ ట్యాంక్ పై ఉన్నవారు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలను విరమించుకున్నారు.